తాను అడిగిన అన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు చెప్పిన ఇన్స్పెక్టర్ రుద్రతో ‘శభాష్ రుద్ర. బాగా చెప్పావ్. బంధించిన రెండో వ్యక్తిని కాపాడుకోవాలంటే దక్షిణ దిక్కున ఊడల మర్రి కింద ఉన్న చిన్న గదికి వెంటనే వెళ్లు. లేకపోతే, ‘నల్లమల చైన్సా’ విజృంభిస్తుంది’ అంటూ నవ్వాడు సీఐ శరత్. అసలేమైతుందోనన్న భయంతో జయ, శివుడు అండ్ టీమ్‌తో శరత్ చెప్పిన అడ్రస్‌కు పరిగెత్తాడు రుద్ర.
వీళ్లు వెళ్లే సరికి ఊడల మర్రి కింద ఓ చిన్న గది తలుపు తెరిచి ఉంది. అందులో ఓ టేబుల్ మీద బలిచ్చే రెండో వ్యక్తి లత స్పృహ లేకుండా పడి ఉంది. ఆమెను మెలకువలోకి తేవడానికి జయ గది గడప దాటింది. అంతే, టేబుల్ ఇరు పక్కల నుంచి ఒక్కసారిగా పదునైన పెద్ద రంపాలు పైకి ఉబికివచ్చాయి. రుద్ర, జయ చూస్తుండగానే.. సోయిలేని లత తలను నరికి, మొండాన్ని రెండు భాగాలుగా చేశాయి . రక్తం ఏరులై పారింది. జరిగిన హఠాత్పరిణామానికి రుద్ర, జయ నిర్ఘాంతపోయారు. శివుడు కెవ్వుమన్నాడు. రెండోవ్యక్తిని కూడా కాపాడలేకపోయినందుకు బాధపడిన రుద్ర.. కోపంతో డెన్లోకి పరిగెత్తుకొచ్చి శరత్ చెంప ఛెల్లుమనిపించాడు. ‘అసలు నువ్వు మనిషివేనా? సమాధానాలు చెప్తే, మనుషులను కాపాడుకోవచ్చని అన్నావ్‌గా. ఇప్పుడు ఇదేంటీ? మాట మీద నిలబడవా?’ అంటూ శరత్‌పై నిప్పులు చెరిగాడు. ‘ఒరేయ్ పిచ్చోడా.. మనుషులను కాపాడుకోవడం నీకు చేతగాక నన్ను అంటావేంటి? ఊడల మర్రి కింద ఉన్న చిన్న గదికి వెంటనే వెళ్లు. లేకపోతే, ‘నల్లమల చైన్సా’ విజృంభిస్తుంది అని ముందే చెప్పాను. అయితే, గదికి వెళ్లమన్నాను గానీ, గదిలోనికి వెళ్లమన్లేదు. నీదే తప్పు’ అంటూ చిన్నగా నవ్వాడు శరత్.
‘తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? రేయ్.. నాకు గనుక తిక్కరేగిందో నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తా’ అంటూ రుద్ర పూర్తిచేయకుండానే.. ‘హలో బ్రో.. నేను కూడా మొదటి నుంచి అదేగా అంటుంది. నన్ను చంపేయ్. అప్పుడు మళ్లీ ఇంకో జన్మ ఎత్తుతా. 18వ పునర్జన్మ బలిపీఠ యాగానికి మళ్లీ అంకురార్పణ చేస్తా’ అంటూ శరత్ గట్టిగా నవ్వాడు. శరత్ అన్నింటికీ తెగించాడని గ్రహించిన రుద్ర.. మిగతా 16 మందిని ఎలాగైనా కాపాడాలని ఇలా అన్నాడు. ‘ఓకే శరత్. ఐయామ్ సారీ. ఈ నల్లమల చైన్సా ఏంటీ? దాన్నుంచి మిగతా వారిని ఎలా కాపాడాలి?’ అని ప్రాధేయపడ్డాడు. ‘ఎస్.. ఇది నీ నుంచి నేను కోరుకునేది. ఇప్పుడు దారిలోకి వచ్చావ్ మై బ్రదర్. అలా బతిమిలాడుతూ అడుగు. చెప్తా.. ’ అంటూ గట్టిగా నవ్విన శరత్ అది చెప్పాలంటే ముందు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రుద్రకు సవాల్ విసిరాడు. ఇంతలో చంద్రమతి భర్తను దవాఖానలో చేర్చిన స్నేహిల్, రామస్వామి తిరిగొచ్చారు.
శరత్ ప్రారంభించాడు. నల్లమల చైన్సా గురించి తెలుసుకోవడానికి నేను అడుగుతున్న మొదటి ప్రశ్న: ‘ఒక దొంగ ఒక షాప్‌కి వెళ్లి వెయ్యి రూపాయలు దొంగతనం చేసి అదే షాప్‌లో రూ. 700 షాపింగ్ చేశాడు. బిల్లు సమయంలో ఓనర్‌కి రూ. 1000 ఇచ్చాడు. రూ.700 తీసుకొని, మిగతా రూ.300ను దొంగకు తిరిగిచ్చాడు ఓనర్. ఇప్పుడు, ఆ షాప్ ఓనర్ మొత్తంగా ఎంత నష్టపోయినట్టు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..టూ’ రుద్ర ఆన్సర్ చెప్పాడు. రెండో ప్రశ్న.. ‘నువ్వు నాకు ఇచ్చిన పుస్తకంలో 5,6,98,99,111,112 పేజీలను నేను చింపాననుకో.. పుస్తకం నుంచి మొత్తం ఎన్ని పేజీలు మిస్ అయినట్టు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు.
‘మిస్టర్ రుద్ర.. మూడు, నాలుగు, ఐదు ప్రశ్నలకు కలిపి మొత్తంగా ఒకే ప్రశ్న అడుగుతున్నా. కరెక్ట్ సమాధానం చెప్పు. దీనికి మొత్తంగా 15 సెకండ్ల టైమ్ ఇస్తా. ప్రశ్న ఏమిటంటే? హరుని దశావతారాలు ఏమిటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. అంటూ శరత్ ప్రశ్న అడిగాడు. 15 సెకండ్ల సమయమే ఉండటంతో వెంటనే రుద్ర సమాధానం చెప్పడం ప్రారంభించాడు. అయితే, రుద్ర సమాధానాలను వింటున్న స్నేహిల్ మధ్యలో కలుగజేసుకొంటూ.. ‘ఒరేయ్ రుద్ర.. విష్ణుమూర్తి దశావతారాలు అవి కాదురా’ అంటూ గట్టిగా అరిచాడు. అందరూ అటు వైపునకు తిరిగి.. స్నేహిల్ చెప్తున్నది కరెక్టే అంటూ వంతపాడారు. దీంతో స్నేహిల్ మళ్లీ ప్రారంభించాడు.
‘విష్ణుమూర్తి దశావతారాలు.. మత్య్స, కూర్మ, వరాహ, మోహినీ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, కల్కి కదరా.. మరి నువ్వు ఏమేమో చెప్తున్నావ్’ అంటూ రుద్రను వారించాడు స్నేహిల్. జరుగుతున్న పరిణామానికి రుద్ర ఒళ్లంతా చెమటపట్టింది. ‘హేయ్ రుద్ర.. ఏం ఒళ్లంతా తడిసిపోయిందా? ఇలాంటివారిని పక్కనపెట్టుకొంటే నీకు ఇదే గతి. సరే సరే.. భయపడకు. నేను మరో 15 సెకండ్ల టైమ్ ఇస్తాలే. అది పక్కనబెడితే, ఇదీ నీ బ్రదర్ పాండిత్యం. హరికి, హరుడికి కూడా తేడా తెలియదు వాడికి’ అంటూ నవ్వాడు శరత్. దీంతో అసలు విషయం అర్థం చేసుకొన్న స్నేహిల్ తలవంచుకొన్నాడు. మధ్యలో కలుగజేసుకొన్నందుకు క్షమించాలంటూ రుద్ర వైపు ధీనంగా చూశాడు. ‘శివుడికి కూడా దశావతారాలు ఉన్నాయా?’ అంటూ జయ, రామస్వామి తదితరులు షాక్ అవుతుండగానే.. 10 పేర్లను శరత్ ఇచ్చిన ఎక్స్ట్రా 15 సెకండ్ల టైమ్‌లో కరెక్ట్‌గా పూర్తి చేశాడు రుద్ర. దీంతో ‘నల్లమల చైన్సా’ ఏంటో చెప్పడం ప్రారంభించాడు శరత్. అదిపక్కనబెడితే, శరత్ అడిగిన ప్రశ్నలకు రుద్ర ఇచ్చిన సమాధానాలు ఏంటో కనిపెట్టారా?
సమాధానాలు:
మొదటి సమాధానం: రూ.1000
రెండో సమాధానం: 4 పేజీలు (5,6 పేజీ నంబర్లు ఒకే కాగితంలో, 98,99 పేజీలు వేర్వేరు కాగితాల్లో,
111,112 పేజీలు ఒకే కాగితంలో ఉంటాయి)
మూడో సమాధానం: మహాకాలుడు, తార్, బాలభువనేశుడు, షోడశ శ్రీవిద్యేశుడు, భైరవుడు, చిన్నమస్తకుడు, ధూమవంతుడు, బగలాముఖుడు, మాతంగుడు, కమలుడు.