పంచుకుల: హర్యానాలోని పంచకులలో ఏడు మంది విషం తాగి కారులో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ప్రాణాలు(Family Suicide) కోల్పోయింది. అయితే ఆ ఫ్యామిలీ సుమారు 20 కోట్ల అప్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మిట్టల్‌తో పాటు ఆయన భార్య, పేరెంట్స్, ముగ్గురు పిల్లలు కారులో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్ రాసి వదిలినట్లు గుర్తించారు. అంత్యక్రియలను సందీప్ అగర్వాల్ నిర్వహించాలని కోరుతూ ఆ నోట్లో తెలిపారు. అయిదు రోజుల క్రితం ఆ వ్యక్తితో ప్రవీణ్ మిట్టల్ ఫోన్లో మాట్లాడినట్లు తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్ మిట్టల్ కొన్నేళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో చెత్త ఫ్యాక్టరీ పెట్టాడు. రుణం తీర్చని కారణంగా ఆ షాపును బ్యాంకు వాళ్లు కొన్నాళ్లకు సీజ్ చేశారు. తీవ్రమైన అప్పుల్లోకి వెళ్లిన మిట్టల్.. పంచకుల నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లాడు. ఆరేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన టైంలో మిట్టల్‌కు 20 కోట్ల అప్పు ఉన్నట్లు సందీప్ అగర్వాల్ చెప్పాడు.
కొన్నాళ్లు పంజాబ్‌లోని ఖరార్‌కు మకాం మార్చాడు. ఆ తర్వాత హర్యానాలోని పింజోర్కు వెళ్లాడు. నెల క్రితమే అతను పంచకులకు మళ్లీ వచ్చినట్లు తెలుస్తోంది. మిట్టల్ సొంత పట్టణం హిసార్‌లోని బర్వాలా. కొన్నాళ్ల నుంచి పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో ట్యాక్సీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతని వద్ద ఉన్న రెండు ఫ్లాట్లు, వాహనాలను ఇటీవల బ్యాంక్ సీజ్ చేసింది.
డెహ్రాడూల్లో ఉంటున్న మిట్టల్ ఫ్యామిలీ.. సోమవారం భగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లారు. ఆ ఈవెంట్‌కు హాజరై ఇంటికి వస్తున్న సమయంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.