హుజురాబాద్ : జమ్మికుంట, హుజురాబాద్ ప్రధాన రహదారి నుంచి మడిపల్లి పారిశ్రామికవాడ మీదుగా జమ్మికుంట, ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ఎక్కువగా లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు సాగించడంతో పాటు వర్షాల మూలంగా రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రోడ్డు మరమ్మత్తు చేయించాల్సిన అవసరాన్ని గురించి స్థానిక పారిశ్రామికవేత్తలు శివకుమార్, రవీందర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి 24 గంటల్లోనే సీసీ రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్లు మంజూరు చేయించారు. వెనువెంటనే బుధవారం రాత్రి మంత్రి కొప్పుల హమాలీలతో కొబ్బరికాయలు కొట్టించి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్ మల్లయ్య, టిఆర్ఎస్ యువ నాయకులు శ్రీకాంత్, అఖిలేష్ తదితరులు ఉన్నారు.