సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): పేరుకే ప్రజా పాలన.. కానీ ఆచరణలో కనిపించదు. కాంగ్రెస్‌తో దళితులకు సముచితం స్థానం అంటారు. కానీ రాత్రికి రాత్రే ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తారు. అంగబలంతో, అధికార దర్పంతో దళితులు, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారు. సమీపంలో ఉండే భారీ హైరైజ్ అపార్టుమెంట్‌కు అప్రోచ్ రోడ్డు కోసం… నిబంధనలకు విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టేస్తారు. అక్కడితో ఆగకుండా 70 ఏళ్ల క్రితమే నిర్మించుకున్న ఇండ్లను నేలమట్టం చేశారు. నివాసితులకు పరిహారం, ప్రత్యామ్నాయ నివాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. 1957 నుంచి రిజిస్ట్రేషన్లు, ఘర్ పట్టీ కడుతున్నా… దయాదాక్షిణ్యం లేకుండా ఇండ్లను కూల్చివేసి నిరాశ్రయులను చేయడంతో నగరం నడిబొడ్డున ఉన్న గాంధీనగర్ డివిజన్ పరిధిలో స్వామి వివేకానంద కాలనీలోని 19 దళిత, పేద కుటుంబాలపై ప్రభుత్వం జరిపిన బలప్రయోగానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
గ్రేటర్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీనగర్ డివిజన్, స్వామి వివేకానంద నగర్ కాలనీ 1957 కంటే ముందు ఏర్పడింది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో కూలీలుగా పనిచేస్తూ, పక్కనే ఉండే పట్టా భూములను 30, 40 గజాల భూములను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి గుడిసెల నుంచి రేకుల ఇండ్లకు వరకు నిర్మించుకున్నారు. ఐదు తరాలుగా అక్కడే స్థిరపడిన వారు కొందరైతే… భూములను రిజిస్టర్ చేసుకుని, ఇండ్లను కొనుగోలు చేసుకున్నారు. 10 ఫీట్లు వెడల్పు లేని ఆకీల్ షా మసీదు మార్గంలో 60ఫీట్ల రోడ్డు నిర్మాణం పేరిట పేద, దళితుల ఇండ్లను నేలమట్టం చేశారు. జనవరి 29న కనీసం నోటీసులు లేకుండా జేసీబీతో కూల్చివేసి 19 కుటుంబాలను రోడ్డున పడేశారు. దీంతో స్వామి వివేకానంద నగర్ కాలనీలో తరతరాలు నివసించిన ఇండ్లన్నీ కూలిపోయాయి.
ఆస్తిపన్ను కడుతున్నా.. నేల మట్టం
సమీపంలో ఉండే వ్యవసాయ పొలాల్లో రైతు కూలీలైన కొంతమంది 1957లోనే భూ యజమానుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఇండ్లను నిర్మించుకుని అక్కడే జీవనోపాధి పొందుతున్నారు. అప్పటీ నుంచి ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించిన 19 మంది ఏడాది క్రితం ఇండ్లను నేలమట్టం చేశారు. 90 దశకంలోనే అప్పటి జిల్లా యంత్రాంగం పట్టాలిచ్చేందుకు సన్నాహాలు చేసింది. అప్పటి ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి హయాంలోనే పట్టాలు జారీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ఇక్కడుంటున్న నివాసితులు భూ ఆక్రమణలదారులంటూ, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని.. నోటీసులు లేకుండా కూల్చివేశారని నిరాశ్రయులైన దళిత, పేదలు పేర్కొన్నారు.
ఏడాది కాలంగా నిరాశ్రయులు..
ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేసిన రెవెన్యూ అధికారులే వారంతా ఆక్రమణ దారులు కాదనీ, వారిలో పట్టాదారులు కూడా ఉన్నారని నివేదించారు. కానీ జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి జనవరిలో రోడ్డున పడేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇక్కడే 100 రోజుల పాటు నిరవధిక దీక్షలు చేసినా… కంటితుడుపు చర్యలుగా తమను ఓదార్చారే తప్పా తమకు తగిన న్యాయం జరగలేదని వాపోతున్నారు. డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు కొందరివైతే… ఆస్తి పన్నులతో ఇంటి యజమానులైన ఎంతో మందిని రోడ్డున పడేశారని స్వామి వివేకానంద నగర్ బస్తీ వాసులు కంటతడి పెట్టుకున్నారు. అధికార బలంతో ధనవంతుల నివాసానికి అప్రోచ్ రోడ్డు కోసం తమ ఇండ్లను కూల్చివేశారంటూ ఆవేదన చెందుతున్నారు. కనీసం ప్రజా దర్బార్‌లో తమ గోడు వినాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని, చీదరింపులు, చీత్కారాలు, బెదిరింపులు తప్పా… తమ గోడును వినలేదని ఆరోపించారు. కనీసం 2006లో కోర్టు ఇచ్చిన ఆదేశానుసారమైన తమకు న్యాయం చేయాలని, పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే నేలమట్టం చేసి, రోడ్డును విస్తరించాలని ఆదేశించింది. కానీ నేలమట్టం చేసినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు.
ఐదు తరాలుగా ఇక్కడే..
వివేకానంద నగర్ బస్తీలో ఐదు తరాలుగా నివాసం ఉంటున్నాం. ఇక్కడే పుట్టి పెరిగాను. కోదండ రెడ్డి హయాంలోనే పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పక్కనే ఉన్నా శతాబ్ది, జనప్రియ అపార్టుమెంట్ వాసులకు లబ్ధి చేకూర్చేలా ఈ రెండో మార్గం ఏర్పాటు చేసేలా విస్తరణకు అడ్డుగా ఉన్నాయని తమ నివాసాలను కూల్చివేశారు. 10 ఫీట్లు లేని మార్గాన్ని 60 ఫీట్లకు పెంచుతామని కూల్చివేసినా ఇప్పటికీ 30 ఫీట్ల వెడల్పు కూడా లేదు. అలాంటప్పుడు మా ఇండ్లను ఎందుకు కూల్చివేశారు. ? పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా ఎందుకు కూలగొట్టారు. ఇక్కడున్న 19 కుటుంబాలన్నీ పేద, దళిత వర్గాలకు చెందినవే. అయినా ప్రభుత్వం కనికరం లేకుండా ఏడాది కాలంగా ఇండ్లను కూల్చి రోడ్డున పడేసింది.
– ఎంవీ కృష్ణా, వివేకానంద నగర్ వాసి.
పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలి
అధికారులు తమకున్న భూహక్కుల పత్రాలను పరిశీలించలేదు. తరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదు. దాదాపు 70ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న వారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేసి రోడ్డున పడేసింది. నిరాశ్రయులైన వారిలో పట్టాదారులు ఉన్నారు, ఆస్తి పన్నులు కడుతున్నవారు ఉన్నారు. కనీసం నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి పిల్లాపాపలను బయటకు ఈడ్చివేసి, మగవాళ్లను పోలీసు స్టేషన్లకు తరలించి, ఇంట్లో వస్తువులు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నేలమట్టం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదు.
-ఆనంద్, స్థానికుడు.
గూడు కోల్పోయి రోడ్డున పడ్డాం..
స్వామి వివేకానంద నగర్ బస్తీలో మొదటి ఇళ్లు నాదే. 10 ఫీట్లు వెడల్పు లేని మార్గాన్ని 60 ఫీట్ల రోడ్డు పేరిట పక్కనే ఉన్న ఇండ్లను కూల్చివేశారు. చిన్నాచితక పనులు చేసుకుంటే బతికే పేదలను నిరాశ్రయులను చేశారు. ఏడాది కాలంగా అధికారుల దౌర్జన్యంతో, పక్కనే ఉండే అపార్టుమెంట్ వాసుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆక్రమణదారుల పేరిట దశాబ్దాల కాలంగా ఉంటున్న ఇండ్లను భూమిలో కలిపివేశారు. అధికారులు కూడా ఉన్నత వర్గాలు చెప్పే తప్పుడు మాటలను నమ్ముతున్నారే తప్పా… తరాలుగా ఇక్కడే ఉంటున్న మా మాటలను పట్టించుకోవడం లేదు.
– జ్ఞానేశ్వర్, బస్తీ వాసి