వాతావరణ మార్పులు.. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరినీ ఏదో ఓ రకంగా ప్రభావితం చేస్తాయి. అయితే.. ఆ ప్రభావం అందరిమీదా సమానంగా ఉండటం లేదట. పురుషులతో పోలిస్తే, ఆడవాళ్లపైనే వాతావరణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని పలు సర్వేలు చెబుతున్నాయి. పర్యావరణ మార్పుల వల్ల నేరుగా ప్రభావితమయ్యే వాటిలో మహిళలు నిర్వహించే పనులే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఆహారం, నీరు, ఇతర సదుపాయాలను కల్పించడంలో మహిళలే కీలకంగా ఉంటారు. కరువులు, వరదలతో వనరుల కొరత ఏర్పడినప్పుడు.. మహిళలపై పనిభారం గణనీయంగా పెరుగుతుంది. ఇదేసమయంలో వారి ఆదాయం తగ్గడంతోపాటు అమ్మాయిల చదువులకూ తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతుంటాయి.
ఇక ఇంటిలోనూ అత్యంత కాలుష్యాన్ని కలుగజేసే పని ప్రదేశాల్లో మగ్గేదీ మహిళలే! ముఖ్యంగా.. వంటింట్లో తీవ్రమైన పొగ, కలుషిత ఇంధనాలను ఉపయోగించడం స్త్రీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వంటింట్లో పేలవమైన గాలి నాణ్యత కూడా వారిని ఇబ్బంది పెడుతున్నది. దీనివల్ల.. మహిళల్లో ముందస్తు కాన్పులు, తక్కువ బరువుండే పిల్లలు పుట్టడం లాంటి సమస్యలూ ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల 2050 నాటికి 15.8 కోట్లమంది మహిళలు, బాలికలు మరింత పేదరికంలోకి దిగజారుతారని యునైటెడ్ నేషన్ నివేదిక పేర్కొంది. 23.2 కోట్లమంది ఆహార భద్రతపై ప్రభావం పడుతుందనీ ఆందోళన వ్యక్తం చేసింది.