న్యూఢిల్లీ: మూడు నెలల్లో 11 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన యాక్సెంచర్, ఉద్యోగులు ఏఐపై మళ్లీ శిక్షణ పొందకుంటే తొలగింపులు తప్పవని సంకేతాలిచ్చింది. 865 మిలియన్ డాలర్ల కంపెనీ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని గురువారం వెల్లడించింది. కన్సల్టింగ్ ప్రాజెక్టులకు బలహీనమైన కార్పొరేట్ డిమాండ్ ఉందని, యూఎస్‌లో ఫెడరల్ వ్యయం తగ్గించనున్నట్టు అందులో తెలిపింది.
ఈ ఏడాదిలో జనరేటివ్ ప్రాజెక్టులకు సంబంధించి 5.1 బిలియన్ డాలర్ల కొత్త బుకింగ్స్ వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ‘మన రీ ఇన్వెంటర్లకు అదనపు నైపుణ్యాలు నేర్పించడంపై మనం పెట్టుబడి పెడుతున్నాం’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలీ స్వీట్ తెలిపారు. ప్రస్తుతం యాక్సెంచర్‌లో 77 వేల మంది ఏఐ లేదా డాటా ప్రొఫెషనల్స్ ఉన్నారు.
బెర్లిన్: ప్రపంచంలో అతి పెద్ద ఆటోమోటివ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కంపెనీల్లో ఒకటైన బాష్ జర్మనీలోని తన మొబిలిటీ డివిజన్ నుంచి 13 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. వ్యయ నిర్వహణ తగ్గింపును 2.5 బిలియన్ల యూరోల మేర తగ్గించుకొనేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పింది. ప్రపంచ వాహన మార్కెట్ స్తబ్దుగా ఉండటం, టెస్లా, బీవైడీ నుంచి తీవ్ర పోటీ, అమెరికా సుంకాల కారణంగా పెరిగిన ఖర్చుల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
వాహనాల విడి భాగాలు, సాఫ్ట్వేర్ డిమాండ్ బాగా పడిపోవడం ఉద్యోగాల కోతకు కీలక కారణమని బాష్ తెలిపింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు స్టీఫెన్ గ్రాస్చ్ మాట్లాడుతూ ఉద్యోగాల కోతలు విచారకరమని అయినా తప్పించడం వీలు కానివని వ్యాఖ్యానించారు. తయారీ కేంద్రాలు, కొత్త భవనాలపై పెట్టుబడిలో కోత విధించాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.