హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సరైన అర్హతలు లేకుండా వైద్యం చేయడంతోపాటు ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐదుగురు వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం టీఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఇండియన్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
వీరిలో చైతన్యరెడ్డి (ఆక్సికేర్ హాస్పిటల్, ఈసీఐఎల్), గౌతమ్‌రెడ్డి(ఓమ్ని హాస్పిటల్, కొత్తపేట్), మల్లికార్జునరావు (ఇవ్యా హాస్పిటల్, వనస్థలిపురం), ఉమామహేశ్వర్ (పద్మావతి న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సంగారెడ్డి)పై ఆరు నెలలు సస్పెన్షన్ వేటు వేసింది. కన్నయ్య తల్లపల్లి (లివ్యంగ్ క్లినిక్, జూబ్లీహిల్స్)పై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేసింది. వీరంతా వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పది రోజుల్లోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అందజేయాలని నోటీసులలో ఆదేశించింది. ఒక వేళ సర్టిఫికెట్లను అందజేయడంలో ఆలసత్వం వహిస్తే శాశ్వతంగా వారి పేర్లను మెడికల్ రిజస్టర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.