మిర్యాలగూడ, సెప్టెంబర్ 26: గిరిజన యువకుడిని పోలీసుస్టేషన్లో పెట్టి అకారణంగా తీవ్రంగా కొట్టిన ఎస్ఐని వెనకేసుకు రావడమే కాకుండా.. అతడిని కాంగ్రెస్ గిరిజన నాయకులు కనీసం పరామర్శించలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు హాతీరాం, బాలాజీ నాయక్, సేవ్యా నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘దామరచర్ల మండలం కొత్తపేట తండాలో సాయిసిద్ధు తన సోదరుడిపై ఇతరులు దాడి చేసిన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. ఈ కారణంతో సాయిసిద్ధును వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి పోలీసుస్టేషన్‌కు పిలిపించారు.
అతని కాళ్లపై ఇద్దరు కానిస్టేబుళ్లను నిల్చొబెట్టారు. తల వద్ద ఇంకో కానిస్టేబుల్‌ను ఉంచి సాయిసిద్ధు అరికాళ్లపై ఎస్ఐ విచక్షణారహితంగా కొట్టారు. దీంతో సాయిసిద్ధు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు’ అని తెలిపారు. గిరిజనుల మధ్య ఘర్షణలను కాంగ్రెస్ గిరిజన నాయకులు పరిష్కరించకుండా.. బీఆర్ఎస్ నాయకులు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్ గిరిజనుడిని పరామర్శించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. మరోవైపు అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐకి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ విషయమై పోలీసుస్టేషన్‌కు సాయిసిద్ధును పిలిచి ‘మిర్యాలగూడ పట్టణంలో యూరియా దొరకడం లేదని నీవు ధర్నాలో ఎందుకు పాల్గొన్నావని వీడియో చూపించి మరీ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి విచక్షణారహితంగా సాయిసిద్ధుపై చితకబాదారు’ అని అన్నారు.
ఈ దాడి విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సూచన మేరకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, నోముల భగత్ తదితరులు గిరిజనులను పరామర్శించి అండగా నిలిచారని గుర్తు చేశారు. దీన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డైరెక్షన్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్‌లు బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడారని చెప్పారు. ‘వాస్తవంగా గిరిజనుల మధ్య, ఇతర కులాల మధ్య చిచ్చు పెడుతున్నది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అతని అనుచరులే’ అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుపై స్కైలాబ్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. స్కైలాబ్ నాయక్ కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నాయకుడన్నారు. ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోల్పోవడంతో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నిర్మించిన సేవాలాల్ భవనానికి కాంగ్రెస్‌కు చెందిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ పేరును పెట్టారని, దీన్ని బట్టి భాస్కర్‌రావు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఒకవైపు యూరియా దొరకక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రైతులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో దుర్గంపూడి నారాయణరెడ్డి, కుందూరు వీరకోటిరెడ్డి, బైరం సంపత్, రవీందర్ నాయక్, వెంకటేశ్వర్లు, లలిత తదితరులు పాల్గొన్నారు.