(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం (PM Modi) ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ (Make In India) స్కీమ్ కూడా చేరింది. పథకం ప్రారంభించి 11 ఏండ్లు దాటినప్పటికీ, దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా.. ఉన్న పరిశ్రమలకూ తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన ఐదేండ్లలో 2 లక్షల కంపెనీలు మూతబడటమే దీనికి రుజువు అంటూ గణాంకాలను ఉదహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా స్కీమ్.. జోకిన్ ఇండియాగా మారినట్టు ధ్వజమెత్తుతున్నారు. ఈ పథకం ద్వారా సాధించింది గుండు సున్నా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఆరంభ శూరత్వంలో ప్రధాని నరేంద్రమోదీ అగ్రగణ్యులు. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు.. కుప్పలు తెప్పలుగా ఆర్భాటపు ప్రకటనలు, స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, ఇందులో ఏ ఒక్కటీ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఉదాహరణకు.. 2014, సెప్టెంబర్ 25న ‘మేకిన్ ఇండియా’ పేరిట బీజేపీ సర్కారు పెద్దయెత్తున ప్రచారానికి తెర తీసింది. తయారీ రంగంలో ఏటా 12-14 శాతం వృద్ధిరేటు నమోదు, 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచడం, 2022 నాటికి తయారీ రంగంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ‘మేకిన్ ఇండియా’ స్కీమ్‌ను కేంద్రం ఆర్భాటంగా తీసుకొచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇవేమీ జరుగలేదు.
2013-14 నుంచి ఇప్పటి వరకూ తయారీ రంగంలో వృద్ధి రేటు 5.9 శాతం కూడా దాటలేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 16.4 శాతానికే పరిమితమైంది. తయారీ రంగంలో ఉద్యోగాలు 2011-12లో 12.6 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. ముఖ్యంగా 2016-21 మధ్య ఉద్యోగాలు సగానికి తగ్గిపోయాయి. ఈ గణాంకాలను విశ్లేషిస్తే, మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయినట్టు అర్థమవుతున్నది. గడిచిన ఐదేండ్లలో సుమారు 2 లక్షల కంపెనీలకు తాళం పడినట్టు ఇటీవల కేంద్రమే పార్లమెంట్‌కు స్వయంగా వెల్లడించింది. దేశంలో ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యో గం కావాల్సినవారు 22 కోట్లమంది ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు తేల్చి చెప్పాయి.
‘అచ్చేదిన్’ తీసుకొస్తామంటూ పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తన అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలనూ అస్తవ్యస్తం చేసింది. రూపాయి పతనం చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి చేరుకోగా, ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశం అట్టడుగునకు దిగజారింది. స్వాతంత్య్ర కాలం నాటికి అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశీయ వాటా 2.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం అంతకన్నా తక్కువ 1.5 శాతం నమోదైంది. ఎగుమతుల విలువ పెరిగితే.. అంతర్జాతీయంగా ఆ దేశానికి పరపతి పెరుగుతుంది. దేశీయంగా కంపెనీల సంఖ్య పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.
అయితే, ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా వివిధ అంశాల్లో దేశ పరపతి పడిపోతూనే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో తాజాగా దేశీయ ఎగుమతుల విలువ చరిత్రలో చూడనటువంటి స్థాయికి దిగజారింది. మేకిన్ ఇండియా స్కీమ్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతోనే ఎగుమతుల్లో క్షీణత నమోదైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి ఇండిగో విమాన సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత కంపెనీల పనితీరుపై పెద్దయెత్తున చర్చ జరిగింది.
ఈ సందర్భంగా విమానయాన సేవలందించే ‘ఆన్ అరైవల్’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అంకిత్ సావంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత విమానయాన రంగం పూర్తిగా విదేశాలపై ఆధారపడి నడుస్తున్నదని, అద్దె ప్రాతిపదికన కార్యకలాపాలు సాగిస్తున్నదని అంకిత్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, భారత విమానయాన రంగానికి అవసరమైన ఏ పరికరాన్ని కూడా స్వదేశీ కంపెనీలు తయారు చేయట్లేదని, ఆఖరికి విమానాశ్రయాల్లో వినియోగించే ట్రాలీలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఉన్నదని విమర్శించారు. భారత పైలట్లలో ఒక్కరికి కూడా స్వదేశంలో ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదని, రెట్రో ఫిట్టింగ్ (విమానాల అప్‌గ్రేడ్) కూడా ఇక్కడ జరగదని తేల్చి చెప్పారు.
టారిఫ్‌లు, విదేశీ వలసలపై కఠిన ఆంక్షలు, హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచు తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలతో మోదీ దౌత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశాంగ దౌత్యంలో మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నష్టనివారణ చర్యలకు దిగిన మోదీ.. హఠాత్తుగా ‘స్వదేశీ’ నినాదాన్ని మళ్లీ ఎత్తుకొన్నారు. దేశీయ కంపెనీలను కాపాడుకోవాలని ప్రకటించారు. అయితే, 11 ఏండ్ల కిందట ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ను ఇప్పటివరకు ఎం దుకు గాలికొదిలేశారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ కల్పన, ఉత్పాదకత, కంపెనీలకు ప్రోత్సాహకాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు.
రాబోయే భవిష్యత్తులో రోబోటిక్స్, ఏఐ, ఆటోమేషన్లదే అగ్రస్థానమని ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పారు. దీనికి తగ్గట్టు జపాన్, చైనా, దక్షిణకొరియా తదితర దేశాలు ఆయా దేశాల నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీలో దీన్ని భాగం చేస్తూ తమ ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉండగా.. భారత్ మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. కీలకమైన హై-ఎండ్ మోటార్లు, సెన్సార్లు, అక్చుయేటర్లు, బ్యాటరీలు, ఎంబెడెడ్ కంట్రోల్ సిస్టమ్ వంటి పరికరాలను కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకొంటున్నది. ‘స్టార్టప్ ఇండియా’ పేరిట ప్రారంభమైన రోబోటిక్, ఆటోమేషన్ కంపెనీలకు కూడా తగిన ప్రోత్సాహకాలను అందించడంలేదు. దీంతో భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో భారత్ వెనుకబడటం ఖాయమని, విదేశాలపై ఆధారపడుకుంటూ పోతే, అది దేశ భద్రతకు కూడా సమస్యగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.