న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను డిమాండ్ చేశారు. టూల్‌కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడుతున్నారని ట్విట్టర్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రస్తావించకుండా “టూల్ కిట్.. సత్యం నిర్భయంగా ఉంటుంది” అని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పెట్టిన పోస్టులు బూటకపువి అంటూ ట్విట్టర్ ఆయన ఖాతాపై “మ్యానిపులేటెడ్ మీడియా” అనే ట్యాగ్ పెట్టింది. అంటే మసిపూసి మారేడు కాయ పద్ధతిలో తయారు చేసిన మీడియా పెడుతున్నారని దాని సారాంశం. కాగా ప్రభుత్వం ట్విట్టర్‌ను ఆ ట్యాగ్ తొలగించమని డిమాండ్ చేసింది. దర్యాప్తు సంస్థలు ఆ విషయం పరిశీలిస్తున్నాయి కనుక తొందరపడి అలాంటి ట్యాగ్ లు పెట్టడం సరికాదన్న రీతిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ కు లేఖ రాసింది. కాగా కాంగ్రెస్ నేత సూర్జేవాలా ఒక్క సంబిత్ పాత్ర కాకుండా కేంద్రంలోని 11 మంది మంత్రులపై ఆ ట్యాగ్ పడాలని అంటున్నారు. ఎందుకంటే వారు కూడా పాత్ర తరహాలోనే నకిలీ మీడియా, పోర్జరీ డాక్యుమెంట్లు పెడుతున్నారని ఆయన ఆరోపణ. ఆయన ప్రస్తావించినవారి మంత్రులలో గిరిరాజ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, రమేశ్ పోక్రియాల్, డాక్టర్ హర్ష్ వర్ధన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గజేంద్రసింగ్ షెఖావత్ ఉన్నారు. అందరినీ ఒకేలా చూడాలని సూర్జేవాలా ట్విట్టర్‌కు తెలిపారు. కేంద్రమంత్రులు అసత్యపు మాటలు తమ ట్విట్టర్ ఖాతాలో పెడితే ప్రజలు నమ్మే ప్రమాదముందని సూర్జేవాలా ఆందోళన వ్యక్తం చేశారు.