Kokichi Akuzawa : ఈ రోజుల్లో 60 ఏళ్లు దాటితో దేహం రోగాల పుట్టగా మారుతున్నది. కొద్దిమంది మినహా చాలామంది బీపీ (Blood pressure), షుగర్ (Daibetis), థైరాయిడ్ (Thyroid) లాంటి రోగాల బారిన పడుతున్నారు. కొందరిలో అయితే 40 ఏళ్లకే ఇలాంటి అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు లాంటివి ఈ జీవనశైలి (Life style) వ్యాధులకు కారణమవుతున్నాయి. కానీ జపాన్ (Japan) దేశానికి చెందిన ఓ వృద్ధుడు మాత్రం 102 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు ఈ వయసులో ఏకంగా మౌంట్ ఫుజీ (Mount Fuji) ని అధిరోహించి గిన్నెస్ బుక్లో చోటుసంపాదించారు.
జపాన్ దేశానికి చెందిన 102 ఏళ్ల వృద్ధుడు కొకిచీ అకుజావా (Kokichi Akuzawa) వయస్సు ప్రస్తుతం 102 ఏళ్లు. మన దేశంలో అయితే ఈ వయసులో అసలు బతికి ఉండటమే అరుదు. కానీ అకుజావా మాత్రం ఏకంగా 3,776 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఫుజీ పర్వతాన్ని అధిరోహించారు. దాంతో మౌంట్ ఫుజీని అధిరోహించిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అకుజావా ఘనతను ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు’ సంస్థ కూడా గుర్తించింది.
కాగా, కొంత ఇబ్బందిగా అనిపించడంతో తాను మధ్యలోనే పర్వతారోహణను ఆపేయాలని అనుకున్నానని, కానీ చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహంతో ముందుకు సాగానని అకుజావా చెప్పారు. కాగా అకుజావా 96 ఏళ్ల వయసులో కూడా ఓసారి ఈ పర్వతాన్ని అధిరోహించారు.