మధిర, సెప్టెంబర్ 06 : తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని వస్తున్న వదంతులు నమ్మొద్దని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. శనివారం ప్రొద్దుటూరు గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా గత నాలుగు పర్యాయాలుగా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నానని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వివరించడం జరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.
యూరియా కొరత, అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రొద్దుటూరు గ్రామంలో వెనక్కి వెళ్లిపోగా వాటిని తిరిగి ఇప్పించాలని కోరుతూ డిప్యూటీ సీఎంను కలిసినట్లు వివరించారు. అలాగే పంచాయతీల్లో నిధుల కొరతతో అభివృద్ధి, పారిశుధ్యం వెనకబడిందని ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కేటాయించాలని మాత్రమే మల్లు భట్టి విక్రమార్కను కలిసినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి మరింత పాటుపడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.