Honey Soaked Almonds | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది వివిధ రకాల నట్స్, విత్తనాలను రోజూ తింటుంటారు. ఇక చాలా మంది తినే నట్స్‌లో బాదం పప్పు మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తింటుంటారు. బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి అనేక పోషకాలను ఇది అందిస్తుంది. పలు వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తుంది. అయితే బాదంపప్పును తేనెలో నానబెట్టి తింటే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును కొన్ని గంటల పాటు తేనెలో ఉంచి ఆ తరువాత తినాలి. ఉదయం ఈ పప్పును తేనెలో నానబెడితే సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
తేనెలో నానబెట్టిన బాదంపప్పును తింటే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరం అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు సమతూకంలో లభిస్తాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. హృదయ సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదంపప్పు, తేనె మిశ్రమం బ్రెయిన్ ఫుడ్‌లా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలిపి రోజూ తింటే మెదడు చురుగ్గా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు రెండూ ఒకేసారి లభిస్తాయి కనుక మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు సమస్య తగ్గుతుంది. ఈ మిశ్రమంలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు మెదడుకు కావల్సిన శక్తిని అందిస్తాయి. దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే మెదడులో ఉండే కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. తేనెలో నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ అధికంగా లభించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చర్మం తన సహజసిద్ధమైన సాగే గుణాన్ని పొందుతుంది. దీని వల్ల చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. చర్మ కణాలకు నష్టం జరగకుండా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు.
తేనె, బాదంపప్పు మిశ్రమం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ మిశ్రమం ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, అజీర్తి తగ్గిపోతాయి. తేనె, బాదంపప్పు రెండింటిలోనూ జింక్, విటమిన్ ఇ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ మిశ్రమాన్ని తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమం సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా తేనె, బాదంపప్పు మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.