Donald Trump : ‘నేను అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తా’. అమెరికా అధ్యక్ష ఎన్నికల (US presidential elections) సమయంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ఈ మాట చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ట్రంప్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాను ఆ హామీని నెరవేర్చలేకపోతున్నానని అన్నారు. ఆ యుద్ధం ఆపడం చాలా ఈజీ అనుకున్నానని, కానీ తన హయాంలో చూసిన అత్యంత క్లిష్టమైన ఘర్షణ అదేనని చెప్పారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యులకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తాను ఏడు యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్.. శుక్రవారం సీఈవోలకు ఇచ్చిన విందులో మాత్రం తాను మూడు యుద్ధాలను ఆపానని చెప్పాడు. శనివారం అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ఇచ్చిన విందులో తాను ఏడు సుదీర్ఘ యుద్ధాలను ఆపానని పాతపాట పాడాడు.
ట్రంప్ ఇంకా మాట్లాడుతూ.. ‘గత ఏడు నెలల కాలంలో నేను చేసినంతగా ఎవరూ చేయలేదు. ఏడు యుద్ధాలను ఆపా. 31 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ఘర్షణ ముగియడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ నేను వెళ్లి రెండు గంటల్లో దాన్ని ముగించా. 35-37 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నాకు ఉన్న స్నేహబంధం కారణంగా మాస్కో-కీవ్ యుద్ధాన్ని ముగించడం చాలా సులువైన పని అని భావించా. కానీ అది అంత ఈజీ కాదు. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణను ఆపడం అత్యంత కష్టతరంగా మారింది’ అని ట్రంప్ చెప్పారు.