– ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్
– విద్య, వైద్యం అందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యం
చండూరు, ఆగస్టు 01 : చండూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో గల సమస్యలను వైద్యాధికారి డా.మాస రాజును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి బెడ్లను, ల్యాబ్ ను, ఆస్పత్రి ఆవరణలో కలియ తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ప్రజలకు విద్య, వైద్యం సకాలంలో అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చండూరు ప్రభుత్వ ఆస్పత్రి భవనం ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించింది కావున శిథిలావస్థకు చేరి పై పెచ్చులు ఊడుతున్నాయన్నారు. ఆస్పత్రిని చూసి రోగులు రావాలంటే భయంతో బిక్కుబుక్కుమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు 50 వేల జనాభా ఉన్న చండూరు మండలం, మున్సిపాలిటీ మౌలిక సదుపాయాలతో కూడిన ఆస్పత్రి లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. చేశారు. తక్షణమే చండూరు పట్టణ కేంద్రంలో వంద పడకలతో కూడిన నూతన ఆస్పత్రిని నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతవరకు ఈ దవఖానాను వేరేచోటికి మార్చాలని, ఆస్పత్రి నిర్వహణకు, ప్రజలకు అవసరం ఉన్నా మౌలిక సదుపాయాలను తన వంతు వెంటనే సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా స్త్రీల కోసం గైనకాలజిస్ట్ డాక్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా తమ ఫౌండేషన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యుడు ఇరగదిండ్ల అశోక్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.