చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్రాణవాయువు చెట్టు చలవే. ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఆహారానికి వృక్షమే మూలం. చెట్టు జాడలేని నేలను, చెట్టు నీడ లేని జీవితాన్నీ ఊహించుకోలేం. ఏండ్లు గడుస్తున్న కొద్దీ పచ్చదనం తగ్గుతున్నది, అడవులు కోతకు గురవుతున్నాయి. కాలుష్యం పెరిగిపోతున్నది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. పెద్దలు చెప్పిన పచ్చని వాక్కును గుర్తుచేసుకోవడమే! ఆ మార్గంలో అడుగు ముందుకు వేయడమే. ఆ లక్ష్యంతోనే, ఆరేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని మొదలుపెట్టింది. ఇదేదో మొక్కుబడి కార్యక్రమమని విమర్శించినవారు నేలకు ముక్కు రాసుకొనేలా.. రెండు వందల నలభై కోట్లకు పైగా మొక్కలతో… ఆకుపచ్చటి తెలంగాణను కండ్లకు కట్టింది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయడం ఒక ఎత్తయితే… నాటిన వాటిని కంటికి రెప్పలా సంరక్షించడం మరో ఎత్తు. ఆ కర్తవ్యాన్నీ సమర్థంగా నిర్వహించింది యంత్రాంగం. ‘తెలంగాణకు హరితహారం’ ఇప్పుడు ప్రపంచానికో పర్యావరణ పాఠం. పచ్చదనం ఓ నిరంతర ప్రక్రియ కావాలి. ప్రతి రోజూ, ప్రతి నిమిషం.. ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఏదో ఓ మొక్కను నాటుతూనే ఉండాలి. కాబట్టే, హరిత ఉద్యమాన్ని సమష్టి బాధ్యతగా తీర్చిదిద్దుతున్నారు సీఎం కేసీఆర్.
కలిసి సాగే చినుకులే జలధారలవుతాయి. ఒక్కొక్కటిగా తోడయ్యే కాసులే నిధులుగా మారతాయి. అందుకే హరిత నిధి కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విరాళాన్ని సేకరిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల హోదాను బట్టి నెలనెలా పది రూపాయల నుంచి 500 రూపాయల వరకు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. సివిల్ సర్వీస్ అధికారులు నెలకు 100 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ నెలకు 25 రూపాయలను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీటి ద్వారా ఏటా 30 కోట్ల రూపాయల హరిత నిధి సమకూరుతుందని అంచనా. వీటికి అదనంగా నియోజకవర్గ నిధుల నుంచి పదిశాతం జోడించాలన్నది ప్రభుత్వ యోచన. విద్యార్థులు కూడా విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలో ఓ పది రూపాయలను హరిత నిధికి అందిస్తారు. ఆ మొత్తం చిన్నదే కావచ్చు, కానీ అది మనిషి చిత్తాన్ని, చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. హరిత నిధి సంకల్పానికి మద్దతుగా విరాళాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు చాలామంది. ఆసరా పింఛనుదారులు సైతం హరిత నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. కోటపల్లి మండలానికి చెందిన షట్పల్లి, సిర్స గ్రామవాసులు తమ పెన్షన్ నుంచి ఆరు రూపాయల చొప్పున నిధికి అందించడం ఇందుకు ఉదాహరణ. ఆదిలాబాద్‌లోని ముఖరా గ్రామ పంచాయతీ తన ఆదాయం నుంచి నెలకు రెండువేల రూపాయలను హరిత నిధికి అందిస్తున్నట్టు ప్రకటించింది.
నిపుణుల వెన్నుదన్నుతో
ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేస్తుంది. అది నచ్చితే ప్రజలు స్వాగతిస్తారు. కానీ సాధారణంగా నిపుణుల విశ్లేషణలు భిన్నంగా ఉండవచ్చు. హరిత నిధికి నిపుణుల బాసట కూడా అందడం విశేషం! ‘హరిత నిధిని సాధారణ గ్రీన్ టాక్స్ గాటన కట్టలేం. హరిత ఉద్యమంలో అందరినీ కలిపే ప్రయత్నమిది. ప్రతి అంచెలోనూ నిఘా, నియంత్రణ, నిబద్ధత కల్పించే యత్నమిది’ అంటారు అటవీశాఖ మాజీ అధికారి ఒకరు. ‘హరిత నిధితో అడవులను విస్తరించవచ్చు. పర్యావరణాన్ని రక్షించేందుకు, భూతాపాన్ని తగ్గించేందుకు కూడా సాధ్యమవుతుంది’ అంటారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ విశ్రాంత అధికారి తేజ్ సింగ్. పక్షి ప్రేమికులు కె. రాజీవ్, ‘రెయిన్ వాటర్ ప్రాజెక్’్ట వ్యవస్థాపకులు కల్పనా రమేష్ లాంటి ఎందరో హరితహారం వల్ల… పర్యావరణంలో స్పష్టమైన మార్పులు కనిపించాయనీ, హరిత నిధి మరింత మెరుగైన ఫలితాలను అందిస్తుందనీ భరోసాగా చెబుతున్నారు. ‘తెలంగాణ ఏర్పాటు సమయంలో.. భౌగోళిక పరిస్థితుల కారణంగా తీవ్రమైన కరువులను ఎదుర్కొంటామని చాలామంది ఊహించారు. కానీ హరితహారంతో అద్భుతాలు సృష్టించారు. అందులో నాటిన 85 శాతం మొక్కలు బతికాయి. హరిత నిధి మిగిలిన 15 శాతానికి అండగా ఉండబోతున్నది’ అంటారు పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్.
చరిత్రకు కొనసాగింపు
అనాదిగా మనిషి గొడ్డలివేటు చెట్ల మీద పడుతూనే ఉంది. పెద్ద మనసుతో, అతనికి తలవంచుతూనే ఉన్నాయి వృక్షాలు. కానీ అరుదుగా వాటికి అండగా నిలబడిన ఘట్టాలు చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. వాటిలో ముందుగా గుర్తుకువచ్చేది బిష్ణోయ్ కట్టుబాటు. 15 వ శతాబ్దంలో జంభేశ్వర్ అనే గురూజీ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. బీస్ నోయి- అంటే 29 సిద్ధాంతాలే వీరి జీవనశైలికి మూలం. చెట్లను, వన్యప్రాణులను ప్రాణప్రదంగా కాచుకోవడం వాటిలో భాగం. ఆ సిద్ధాంతాల పట్ల వారి నిబద్ధత అపూర్వం. ఒకసారి జోధ్‌పుర్ మహరాజు, తన భవన నిర్మాణానికి కలప కోసం బిష్ణోయ్ వాసులు ఉండే ప్రాంతానికి సైనికులను పంపాడు. కానీ చెట్లను నరికేందుకు బిష్ణోయిలు అంగీకరించలేదు. వాటికి రక్షగా కౌగలించుకుని నిలబడ్డారు. చెట్ల బదులు తామే గొడ్డలి వేటుకు బలయ్యారు. ఈ ఊచకోతలో ఏకంగా 363 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు.
చివరికి రాజుగారే దిగివచ్చి, వారికి క్షమాపణ చెప్పుకొన్నాడు. జింకల వేటలో సల్మాన్ ఖాన్ తదితరులను మూడు చెరువుల నీళ్లు తాగించింది కూడా వీరే. జింకపిల్లలకు స్తన్యమిచ్చి మరీ ఆదరించే వీరి ప్రేమ గురించి లోకం విస్తుబోతూ చెప్పుకొంటుంది. బిష్ణోయిల స్ఫూర్తితోనే చిప్కో ఉద్యమం నడిచింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా మహిళలు చెట్లను కౌగలించుకుని వాటిని రక్షించుకున్నారు. దీనికి సుందర్‌లాల్ బహుగుణ వంటి నేతలు సారథ్యం వహించారు. గౌరాదేవి లాంటి స్థానిక మహిళలే ఉద్యమాన్ని నడిపించారు. ఈ చిప్కో ఉద్యమం ‘ఎకో ఫెమినిజం’ అనే సిద్ధాంతాన్ని బలపరిచింది. ప్రకృతితో మహిళలకే అనుబంధం ఎక్కువ. అంతేకాదు! పర్యావరణం నాశనమైతే, ప్రతికూల ప్రభావం పడేది వారిమీదే అని నమ్ముతుంది ఎకో ఫెమినిజం. చెట్లను పరిరక్షించుకునేందుకు ఇలాంటి ఉద్యమాలు చాలానే నడిచాయి. కేరళలోని ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం మొదలుకొని ఈమధ్య ముంబైలో ఆరే అడవుల నరికివేతను ప్రతిఘటించిన సందర్భం వరకు చాలా ఘట్టాలే ఉన్నాయి.
కార్పొరేట్ సామాజిక బాధ్యతగా..
కొంత లాభాన్ని స్వచ్ఛంద సేవకు ఉపయోగించే సంస్థల గురించి మనకు తెలుసు. సేవనూ వ్యాపారాన్నీ మిళితం చేసే సామాజిక వ్యాపారస్తుల గురించీ వింటున్నాం. కానీ కెనడాకు చెందిన ‘టెన్ ట్రీ’ సంస్థది ఓ వినూత్నమైన కథ. ఆ దేశానికి చెందిన కెలన్ ఎమ్స్లే, డెరిక్ ఎమ్స్లే అన్నదమ్ములు. వాళ్లిద్దరూ కలిసి దుస్తుల వ్యాపారం చేయాలనుకున్నారు. తమ ఉత్పత్తులు పర్యావరణహితంగా ఉండాలనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కెలన్కు మొక్కలంటే ప్రాణం. వాటిని తన వ్యాపారంతో ముడిపెట్టాలనుకున్నాడు. తమ దగ్గర షాపింగ్ చేసే ప్రతి కస్టమర్ పేరు మీదా పది మొక్కలు పెంచాలని సంకల్పించాడు. వ్యాపారం ఎదిగింది. ఒక్క కెనడాలోనే 300 కు పైగా రిటైల్ స్టోర్లు తెరిచారు. ఆన్లైన్ అమ్మకాలూ మొదలయ్యాయి. ఎమ్స్లే సోదరులు మాట తప్పలేదు. సంస్థ నెలకొల్పి పదేండ్లు తిరక్కుండానే ఆరుకోట్ల మొక్కలు నాటారు. ప్రతి వినియోగదారుడూ, తన మొక్కల గురించి తెలుసుకునేందుకు వాటికి ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేశారు. వేల హెక్టార్లను పచ్చగా మార్చారు. 2030 నాటికి వంద కోట్ల మొక్కలను నాటడం తమ లక్ష్యంగా చెబుతున్నారీ ఎమ్స్లే సోదరులు.
సరికొత్త ఊపిరి!
అసలే ఇరుకు గదులు. ఆపై కాలుష్యం, రణగొణ ధ్వనులు, ఉక్కపోత… ఇదంతా పట్టణ జీవితాల గురించే అని అర్థమై ఉంటుంది. హరితహారం, హరితనిధుల సాయంతో పట్టణాల్లో మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. చెట్లు స్వచ్ఛమైన గాలి, చల్లదనం ఇవ్వడంతో పాటు ధ్వనికాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. మన చుట్టూ 0.1 శాతం పచ్చదనం పెరిగినా ఆయుః ప్రమాణం ఎంతోకొంత మెరుగవుతుందని తాజా పరిశోధన చెబుతున్నది.
పట్టణాల్లోని భవనాలు, కాంక్రీట్ దారుల వల్ల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ అంటారు. దీన్ని తట్టుకునేందుకు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉక్కపోత కుండపోత వర్షాలకు కూడా కారణం అవుతుంది. ముంబై, చెన్నై లాంటి నగరాలు తరచూ తడిసిపోవడానికి కారణం ఇదే! పచ్చదనమే ఇందుకు సమాధానం.
పచ్చదనం కంటికి కనిపిస్తే… మనిషి మనసు తేలికపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దల్లో డిప్రెషన్ లాంటి సమస్యలు, పిల్లల్లో ADHD లాంటి లక్షణాలు తగ్గుతాయని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నాయి. పని మధ్యలో కాసేపు దృష్టి మళ్లించి చెట్ల వైపు చూసినా ఒత్తిడి తగ్గి ఉత్పాదక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
ఆఫీస్‌లో కంప్యూటర్, ఇంట్లో టీవీ, మంచం మీద మొబైల్… ఇదీ మన జీవితం. వయసుతో సంబంధం లేకుండా స్క్రీన్ టైమ్ పెరిగిపోవడంతో అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. ఇందుకు విరుగుడుగా గ్రీన్ టైమ్- అంటే చెట్ల మధ్య గడిపే సమయాన్ని పెంచుకోవడమే పరిష్కారం అని సూచిస్తున్నారు.
తమిళనాడులో తిరుప్పూర్‌కు చెందిన గురుసామి అనే భూస్వామి, తన భూమిలోకి జింకలు రావడం చూశాడు. వాటిని స్వేచ్ఛగా తిరగనిచ్చాడు. ఫలితం! ఇరవై ఏండ్లు గడిచేసరికి అక్కడి జింకల సంఖ్య మూడురెట్లు అయింది. చెట్టంటే నిలబడి చూసే చోద్యం కాదు. అది ఓ లోకం. దాన్ని ఆవాసంగా, ఆహారంగా చేసుకుని ఎన్నో జీవాలు బతికేస్తాయి. జింకలు, నెమళ్ల దాకా అక్కర్లేదు. సీతాకోకచిలుకలు, తుమ్మెదలు, పిచ్చుకలు లాంటి చిన్న ప్రాణులు చాలు… జీవ వైవిధ్యాన్ని పెంచడానికి.
జనావాసాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మురుగునీరు పెద్ద సమస్య. వాటిని చెట్ల పెంపకానికి వాడవచ్చు. అంతేకాదు! మట్టిపెళ్లలు విరిగిపడకుండా, వరద నీరు ముంచెత్తకుండా అడ్డుకుంటాయి.
చెట్లను నాటేందుకు ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు శ్రమించడం కొత్తేమీ కాదు. కొన్ని సంస్థలు చెట్లను, పర్యావరణాన్ని రక్షించేందుకు నిధులను ఏర్పాటు చేయడమూ వింటున్నదే! కానీ వృక్ష సంపదను పదిలపరిచేందుకు ప్రభుత్వమే ఓ నిధిని ఏర్పాటు చేయడం మాత్రం తెలంగాణకే సాధ్యమైంది. హరితహారం ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచినట్టు, హరితనిధి ప్రపంచానికే ఆదర్శం కానున్నది. నిధి అంటే .. డబ్బో దస్కమో కాదు. మనిషిగా మన విధి!
ఆన్లైన్ ఉద్యమం
అమెజాన్… ఆ పేరు వింటేనే పచ్చటి లోకం కండ్ల ముందు పరుచుకుంటుంది. 70 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాలను చుట్టుముడుతూ కోట్ల వృక్షాలతో, అరుదైన జీవజాతులతో పుడమికి ఆయువుపట్టుగా ఉందీ అడవి. మొదట్లో దేశాలన్నీ అమెజాన్‌ను అపురూపంగా చూసుకునేవి. క్రమంగా, అక్కడి అపారమైన వనరులను సొమ్ము చేసుకోవాలనే తపన మొదలైంది. దాన్ని అడ్డుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. వారిలో నెమోంటె నెంక్విమో ఒకరు. తనది వావోరాని అనే తెగ. 2018లో వావోరాని తెగకు జీవనాధారమైన అయిదు లక్షల ఎకరాల్లో చమురు వెలికితీతకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు లోకాన్నే ఏకం చేసింది నెమోంటె. తమ జనాభా అయిదు వేల మందికి మించకపోయినా… ఆన్లైన్లో లక్షల సంతకాలను సేకరించి, అడవిని కాపాడే ఉద్యమం సాగించింది. ఆ పోరుకు ఫిదా అయిన న్యాయస్థానం… తవ్వకాలు నిషేధించడమే కాకుండా, భవిష్యత్తులో స్థానికుల అనుమతి లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ హెచ్చరించింది. ఎన్నో పర్యావరణ ఉద్యమాలకు ఈ తీర్పు ఊతంగా నిలిచింది. ఈ పోరుతో నెమోంటె ‘టైమ్’ పత్రిక ప్రభావశీలుర జాబితాలో నిలిచారు. ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్’ అందుకున్నారు.
మిద్దె మీదే అడవి…
మొక్కలు పెంచడం చాలామందికి ఇష్టం. కానీ అడుగు నేల కూడా అపురూపంగా తోచే కాంక్రీట్ జంగిల్లో మొక్కలు పెంచడం ఎలా అనే ప్రశ్నకు జవాబే ‘మిద్దె తోటల పెంపకం’. కుండీలో ఉంచగలిగితే చాలు…. వీలైనన్ని రకాలను పెంచుకోవచ్చు. కొవిడ్ సమయంలో ఈ అలవాటు కోట్ల మందిని సేద తీర్చింది. ఒంటరితనాన్ని పారదోలడం నుంచి ఉపాధి వరకూ ఎన్నో రకాలుగా ఆదుకుంది. భద్రాచలానికి చెందిన కె.జ్యోతి ప్రియాంక, ఆరువందల చదరపు అడుగుల డాబా మీద ఏకంగా 700 కుండీలను సంరక్షిస్తున్నారు. తన చేత్తో పెంచిన కూరలు తినాలనుకునే సరదాతో మొదలైన ఈ వ్యాపకంతో ఇప్పుడు ఆదాయం కూడా వస్తోంది. డాబా మీద ఏకంగా ఓ పూలవనాన్నే పెంచుతున్నారు ప్రియాంక. వాటిలో ఏషియాటిక్ లిల్లీ లాంటి పూల కోసం సుదూర ప్రాంతాల నుంచీ ఆర్డర్లు రావడం విశేషం. కాస్త మెలకువలు పాటిస్తే రూఫ్‌టాప్ గార్డెన్తో చల్లదనం, కాలక్షేపం, ఉపాధి, స్వచ్ఛమైన గాలి అన్నీ సాధ్యమే!
వినూత్న.. ఉద్యమకారుడు
చెట్టు. కాండం.
కొమ్మలు, రెమ్మలు.
కొమ్మరెమ్మలకు ఆకులు.
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత ఉద్యమాన్ని కూడా ఓ మహా వృక్షంతో పోల్చవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరితహారం’ ఆ చెట్టుకు అమ్మ వేరు. ఆన్లైన్ – ఆఫ్‌లైన్ ప్రచారాలు, సెలబ్రిటీల భాగస్వామ్యం, హరిత సాహిత్యం, సీడ్ బాల్స్, అడవుల దత్తత.. ఇవన్నీ శాఖోపశాఖలు. మొక్కనాటి, నీళ్లు పోసి, కంచెపెట్టి, కంటికి రెప్పలా కాచుకొని, పెంచి పెద్ద చేసినంత శ్రద్ధగా సాగుతాయి సంతోష్ కుమార్ హరిత ఉద్యమ కార్యక్రమాలు. జనానికి సెలబ్రిటీలంటే మక్కువ. వాళ్ల మాటంటే విలువ. వారిని యథాతథంగా అనుసరించాలన్న తహతహ. అభిమాన తారలు మొక్కలు నాటితే, అభిమాన గణం మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? ఎవరికివారు మొక్కలు నాటి అగ్రనటుల అడుగుజాడల్లో నడవాలనుకుంటారు. కాబట్టే, సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో తెరవేల్పులనూ భాగస్వాములను చేశారు. ఈ కార్యక్రమం టాలీవుడ్లో మొదలై బాలీవుడ్ వరకూ విస్తరించింది. తారామండలాన్ని దాటుకొని.. క్రీడారంగానికి పాకింది. న్యాయ వ్యవస్థ ప్రశంసలు అందుకొంది. చట్టసభల్లోనూ చర్చనీయమైంది. ఆ ఫొటోల అప్లోడ్లు, షేర్లు, కామెంట్లు, లైక్‌లు.. ఆన్‌లైన్‌లోనూ సమాంతరంగా ఉద్యమ వాతావరణాన్ని సృష్టించాయి.
సాంకేతికత సాయంతో: టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యమ వేగం పెరుగుతుంది, అందులోనూ, డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సేద్యం నుంచి సరిహద్దుల రక్షణ వరకూ అనేక రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆ నైపుణ్యాన్ని హరిత ఉద్యమానికీ జోడించారు సంతోష్‌కుమార్. డ్రోన్ల సాయంతో సీడ్‌బాల్స్‌ను వెదజల్లాలన్న ఆలోచనే అద్భుతం. బిందువులన్నీ సింధువు అయినట్టు, ఆ మొక్కలే ఓ మహారణ్యాన్ని సృష్టించబోతున్నాయి.
సంరక్షకుడు: చరిత్రలో ఇప్పటివరకూ రెండు రకాల నాయకులే కనిపిస్తారు.. అడవులను జయించినవారు, అడవులను నాశనం చేసినవారు. కానీ, అడవిని ఓ బిడ్డలా దత్తత తీసుకున్న దాఖలాలు లేవు. కానీ, సంతోష్ కుమార్ రెండువేల పైచిలుకు ఎకరాల్లో విస్తరించిన కీసర అడవిని కన్నబిడ్డలా అక్కున చేర్చుకొన్నారు. పచ్చదనంతో అనుబంధం పెంచుకోవడమే కాదు, బంధుత్వమూ కలుపు
కొన్నారు. కీసరలోని చెట్లకూ ఆధార్ కార్డులు ఉంటే.. తండ్రి లేదా సంరక్షకుడు అన్నచోట జోగినపల్లి సంతోష్‌కుమార్ అనే రాసుకుంటాయేమో.
పచ్చని సాహిత్యం: అక్షరం ఆలోచింప
జేస్తుంది, పుస్తకాల సాక్షిగా మారిన జీవితాలు అనేకం. ‘వృక్ష వేదం’ ద్వారా తెలుగులో సరికొత్త సాహితీ శాఖను సృష్టించారు సంతోష్. చెట్టు కథానాయకుడిగా ఓ ఉద్గ్రంథాన్ని తీసుకొచ్చారు. ప్రాచీన సాహిత్యంలోని వృక్ష వైభోగాన్ని ఓ చోట కూర్చారు.ఆ బుక్ డిజైనింగ్‌లోనూ ఎంతో వైవిధ్యం. పుస్తకాన్ని పట్టుకుంటే చాలు, మొక్కను ముద్దాడుతున్న భావన కలుగుతుంది. దసరా, దీపావళి, సంక్రాంతి, బతుకమ్మ, బోనాలు.. సందర్భం ఏదైతేనేం. మొక్క నాటడాన్ని మించిన పెద్ద పండుగ ఉంటుందా? సంతోష్ ప్రతి వేడుకను, ప్రతి ఆనందాన్ని, ప్రతి అనుభూతిని, ప్రతి జ్ఞాపకాన్ని చెట్టుతో ముడిపెట్టారు. అది వినాయక చవితి అయితే విత్తన గణపతిని పూజించమంటారు, అది దసరా అయితే జమ్మిచెట్టు నాటమంటారు. సంతోష్ ఉద్యమ కార్యాచరణకూ చెట్టే స్ఫూర్తి. చెట్టు వేర్లు భూమిలో చొచ్చుకుపోయినట్టు, మొక్కలు నాటాలన్న ఆలోచన గుండెల్లో పాతుకుపోవాలన్నది ఆయన ఆలోచన. నిజమే, మనసులో సంకల్ప బీజం నాటగలిగితే.. నేలలో మొక్కలు నాటడం ఎంతసేపు!
కాంక్రీట్ జంగిల్లో..
స్టెఫానో బొయెరీ ప్రముఖ ఆర్కిటెక్ట్. ఇటలీలోని మిలాన్ నగరంలో బ్రహ్మాండమైన అపార్టుమెంటు కట్టమంటూ ఎవరో ఆయనను సంప్రదించారు. వాటిని కాస్త వినూత్నంగా నిర్మించాలనుకున్నాడు. చిన్నప్పుడు చదువుకున్న ‘ద బారన్ ఇన్ ద ట్రీస్’ అనే నవల గుర్తుకు వచ్చింది. అందులో నాయకుడు చెట్ల మీద ప్రేమతో వాటి మధ్యే గడుపుతుంటాడు. ఆ ఆలోచనతో ఓ అరుదైన భవనాన్ని డిజైన్ చేశాడు. దీనికి ‘బోస్కో వర్టికల్’ అని పేరు పెట్టారు. దీనికోసం…. 364 అడుగుల ఎత్తుతో ఒక భవనం, దాని పక్కన 249 అడుగుల ఎత్తుతో మరో భవనాన్ని నిర్మించారు. వాటి మీద ఏకంగా 900 చెట్లను పెంచాడు. ఇవి కాక అనేక మొక్కలను నాటాడు. నగరం నడిబొడ్డున, రద్దీ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నా.. కాలుష్యానికీ, ధ్వనులకూ అతీతంగా కనిపిస్తుంది బోస్కో వర్టికల్. ఈ తరహా నిర్మాణాల్లో ప్రపంచంలోనే ఇది మొదటిది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో… చైనా, నెదర్లాండ్స్, ఈజిప్ట్, సింగపూర్ లాంటి దేశాల్లోనూ ఈ తరహా నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులోని సరజ్పూర్ ప్రాంతంలో ‘నమ్మ ఫారెస్ట్’ పేరుతో 14 అంతస్తుల భవనం నిర్మితం అవుతున్నది.
అక్టోబరు 1, 2021. తెలంగాణ శాసనసభ సాక్షిగా నేలతల్లికి పసుపు కుంకాల కింద పచ్చలహారాన్ని బహూకరిస్తూ సీఎం ఓ ప్రకటన వెలువరించారు. ఆకుపచ్చని తెలంగాణకు రక్షగా ‘హరిత నిధి’ని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వీకరించే నామమాత్రపు విరాళాలతో సాగే ఈ పథకం వల్ల ఓ నిధి సమకూరడమే కాదు, ప్రతి ఒక్కరికీ పర్యావరణం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ చొరవతో గత ఆరేండ్ల కాలంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. లోకంలో ఎక్కడ చూసినా అడవులు చిన్నబోతుంటే… మన దగ్గర మాత్రం కొత్త చిగురులు వేస్తున్నాయి. అంతదాకా ఎందుకు! అటవీ విస్తీర్ణంలో జాతీయ సగటు 21.6 శాతం అయితే, తెలంగాణలో మాత్రం 28 శాతంగా నమోదైంది. మనుషులు ఆరోగ్యంగా, పర్యావరణం స్వచ్ఛంగా ఉండాలంటే భౌగోళిక విస్తీర్ణంలో కనీసం మూడోవంతు అడవులు ఉండాలన్నది జాతీయ విధానం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు హరిత నిధి ఉపయోగపడనుంది.