విధ్వంసకాండకు బాధ్యులెవరు?
కరీంనగర్ నగరానికి ఊపిరిగా నిలిచే పచ్చని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణం తల్లడిల్లుతున్నది. భారీ వృక్షాలు నేలమట్టం చేసి, సుమారు రెండెకరాల స్థలంలో పది అడుగుల లోతు మేర తవ్వకాలతో ప్రకృతి విధ్వంసం చేస్తుండడంతో కన్నీరు పెడుతున్నది.
- శాతవాహనలో పచ్చదనం వినాశనం
- రెండెకరాల్లో నేలకొరిగిన వృక్షాలు.. పది అడుగల లోతుతో తవ్విన గుంతలే
- విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆగ్రహం
- దెబ్బతిన్న ప్రాంతాల వద్ద నిరసన
- చెట్లు కొట్టి, మట్టి తవ్వి సొమ్ము చేసుకున్నది ఎవరంటూ ప్రశ్నలు
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సుమారు రెండెకరాల స్థలంలో ఎటుచూసినా నేలకొరిగిన వివిధ రకాల వృక్షాలు.. పది అడుగుల లోతుతో తవ్విన గుంతలే కనిపిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చెట్ల నరికివేత, మట్టి తవ్వకాలకు అసలు అనుమతి ఉన్నదా..? కలప ఎకడికి చేరింది? విక్రయించగా వచ్చిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లింది? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా, ఈ వ్యవహారంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. బుధవారం కామర్స్, ఆర్ట్స్, లా, సైన్స్ విభాగాలకు చెందిన స్టూడెంట్లు తవ్వకాలు జరిగిన ప్రాంతాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఇటు ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళన చేశారు. చెట్ల నరికివేత, కలప విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 11 : కరీంనగర్ నగరానికి ఊపిరిగా నిలిచే పచ్చని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణం తల్లడిల్లుతున్నది. భారీ వృక్షాలు నేలమట్టం చేసి, సుమారు రెండెకరాల స్థలంలో పది అడుగుల లోతు మేర తవ్వకాలతో ప్రకృతి విధ్వంసం చేస్తుండడంతో కన్నీరు పెడుతున్నది. యూనివర్సిటీలో అభివృద్ధి పనుల మాటున భారీగా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత జరిగిందంటూ విద్యార్థుల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే రెండు రోజుల కింద స్టూడెంట్ల ఫిర్యాదుతో యూనివర్సిటీకి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెట్ల నరికివేత జరిగిన ప్రాంతాలను పరిశీలించి మార్కింగ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 100 చెట్లను నేలమట్టం చేసినట్టు గుర్తించినట్లు తెలుస్తున్నది. అయితే గుట్ట చుట్టుపకల మారింగ్ కాని ప్రాంతాల్లోనూ చెట్లు తొలగించారని విద్యార్థులు చెబుతుండగా, వాస్తవంగా ఎన్ని నేలకొరిగాయన్నది తెలియడం లేదు. విద్యార్థుల అంచనా ప్రకారం.. 300 నుంచి 400 వరకు చెట్లను నరికివేసి ఉండవచ్చని, వాటి విలువ రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. చెట్లను తొలగించడమే కాకుండా కలపను బయటకు తరలించి విక్రయించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కలప ఎకడికి చేరింది? ఎవరి ఆధ్వర్యంలో తరలించారు? విక్రయాలు జరిగితే వచ్చిన సొమ్ము ఎవరికి చేరింది? అన్నది తేలాల్సి ఉంది. మట్టి తవ్వకాలు, చెట్ల తొలగింపు వ్యవహారంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలుగులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఆగ్రహించిన విద్యార్థులు
యూనివర్సిటీలో జరిగిన ప్రకృతి విధ్వంసంపై విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం కామర్స్, ఆర్ట్స్, లా, సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులు తవ్వకాలు జరిగిన ప్రాంతాలకు ర్యాలీగా వెళ్లి పరిశీలించి నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సైతం అకడికి చేరుకుని తవ్వకాలు, చెట్ల నరికివేత ప్రాంతాలను పరిశీలించి ఆందోళన చేశారు. అభివృద్ధి పనుల పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత, వన్యప్రాణుల ఆవాసాల ధ్వంసం ఇష్టారాజ్యంగా జరుగుతున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నరికిన చెట్ల స్థానంలో స్థానిక జాతుల మొకలు నాటి, వన్యప్రాణుల ఆవాసాలను పునరుద్ధరించాలని కోరారు. ఇక్కడ ఎస్‌యూ జేఏసీ చైర్మన్ కరికె మహేశ్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ కేశవ్, శివాజీ, శంకర్, ప్రవీణ్, ఓం ప్రకాశ్, లక్ష్మణ్ సాయి, శ్యాం సుందర్ రెడ్డి, సందీప్, సాయి కిరణ్, శ్రీధర్, సుమన్ పాల్గొన్నారు. అయితే నిరసనకు వెళ్తున్న విద్యార్థులను కొందరు అధ్యాపకులు అడ్డుకున్నారని, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఏఐ చిత్రాలతో పోస్టులు పెడుతున్నారంటూ తమపై చర్యలు తీసుకుంటామని బెదిరించారని పలువురు విద్యార్థులు ఆరోపించడం గమనార్హం.
బొందల గడ్డగా మారుస్తారా?
శాతవాహనలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతూ బొందల గడ్డగా మారుస్తారా? అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ప్రశ్నించారు. నరికిన చెట్లు, తరలించిన మట్టికి లెక చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తవ్వకాలు, చెట్ల నరికివేత జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. పచ్చని చెట్లను తొలగించడంతో నెమళ్లు, కుందేళ్లు, ఇతర పక్షులు కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి, కలప ఎకడికి తరలించారు? ఎవరి అనుమతులతో పనులు చేపట్టారు? అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సందీప్ రెడ్డి, యూనివర్సిటీ అధ్యక్షుడు వరుణ్ శివాజీ, నాయకులు యశ్వంత్, కుమార్, సాగర్ పాల్గొన్నారు.
చెట్ల నరికివేతపై చర్యలు : వీసీ
చెట్ల నరికివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారని పేరొన్నారు. మట్టి తవ్వకాలపై స్పందిస్తూ.. యూనివర్సిటీకి కేటాయించిన సింథటిక్ ట్రాక్ ఎత్తు పెంచేందుకు క్యాంపస్‌లోని మట్టిని వినియోగించినట్టు వివరించారు. మట్టి తీసిన ప్రాంతంలో వర్షపు నీరు సింథటిక్ ట్రాక్‌లోకి చేరకుండా నీటిని మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

