ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ‘ఆంధ్రా ప్రాజెక్టులకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు’ అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు.
- కృష్ణా, గోదావరిలో బంగారంగా పారిన నీళ్లు .. కండ్ల ముందే వదిలేసి, కరువును తెచ్చి పెట్టిన కాంగ్రెస్
- రెండు నదుల్లో కలిపి వెయ్యి టీఎంసీలు దిగువకు!.. కుప్పం వరకు కృష్ణా నీటిని తరలించుకున్న ఏపీ
- గోదావరి పక్కనున్నా నిర్మల్‌లో కరువు ఎందుకు? ప్రకృతి విపత్తు కాదు, ఇది వికృత పాలకుల పాపం
- అష్టగ్రహాల దుష్ట కూటమి కాంగ్రెస్- బీజేపీ.. ఒకటి సంచులు మోసే పార్టీ, మరొకటి చెప్పులు మోసే పార్టీ
- రేవంత్‌రెడ్డి లాగా కావాలని ఎవరైనా కోరుకుంటరా? నిర్మల్ బీఆర్ఎస్ సభలో నిప్పులు చెరిగిన కేటీఆర్
- మూడేండ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్
- కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది
- ముఖ్యమంత్రికి రైతుల యాతనపై కన్నా నా గడ్డం మీదే ఫికర్
- ఎగ్గొట్టిన రైతుబంధు వేయాలి, రుణాలు రీషెడ్యూల్ చేయాలి
- ఓట్లు, సీట్లు తప్ప నిధులు తెచ్చే సోయి బీజేపీ ఎంపీలకు లేదా?
- దమ్ముంటే మోదీ ఇంటిముందు వాళ్లు ధర్నా చేయాలి: కేటీఆర్
- నిర్మల్ నగారా.. కేటీఆర్ గర్జన
రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు అష్ట గ్రహాలు. రైతులు అష్ట కష్టాల్లో ఉంటే వీళ్లంతా ఏం చేస్తున్నారు? బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు, సీట్లు కావాలి. మరి తెలంగాణకు పైసలిచ్చే సోయి లేదా? మోదీ హృదయంలో తెలంగాణకు స్థానం లేదా? నిధుల కోసం మోదీ ఇంటి ముందు ధర్నా చేసే ధైర్యం బీజేపీ నాయకులకు లేదా?
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ‘ఆంధ్రా ప్రాజెక్టులకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు’ అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా రెండు నదుల్లో కలిపి దాదాపు 1,000 టీఎంసీల నీరు దిగువకు తరలివెళ్లిందని చెప్పారు. ఆ నీటిని ఏపీ మళ్లించుకుంటున్నదని, శ్రీశైలం నుంచి 750 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు తీసుకెళ్లిందని తెలిపారు. తెలంగాణలో మాత్రం రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు పేరొస్తదనే ఉద్దేశంతో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ పూర్తిచేయలేదని, కేవలం రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని పడావు పెట్టారని ఆరోపించారు.
నిర్మల్‌లో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుగర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎల్ నినో వల్ల కరువు రాలేదని, ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిందని, ఇది ప్రకృతి పగబడితే వచ్చిన కరువు కాదని, పాలకుల వికృతి తెచ్చిన కరువు అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి వారికి భరోసా ఇవ్వడమే లేదని పేర్కొన్నారు. నీళ్లిస్తానని, కరెంట్ ఇస్తానంటూ కనీసం ధైర్యం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో ఉంటే గ్రామాల్లో నాటకాలు వేయాలని సీఎం చెప్తున్నారని మండిపడ్డారు. ఆయనకు రైతుల జీవితం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ‘రైతులకు ధైర్యం చెప్పడం చేతకాదు కానీ, కేటీఆర్ గడ్డం మీద మాత్రం రేవంత్‌రెడ్డికి ఫికర్ పట్టుకున్నది’ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టి, అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

గోదావరి పారే నిర్మల్‌లో కరువెందుకు?
గోదావరి ఒరుసుకొని పారే నిర్మల్ జిల్లాలో తొమ్మిది కరువు మండలాలు ఎలా ఉంటాయని కేటీఆర్ విస్మయం వ్యక్తంచేశారు. జిల్లాలో కడెం, సదర్మాట్, శుద్ధవాగు, స్వర్ణ వంటి ప్రాజెక్టులు, సాగునీటి వనరులు ఉన్నా, కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని ప్రశ్నించారు. గోదావరిపూర్ మండలంలోని 27వ ప్యాకేజీ కింద గుండంపల్లి లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకాన్ని తానే ప్రారంభించానని గుర్తుచేశారు. నది పకనే ఉన్నా, నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు, కాలువల్లో నింపే ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కడెం నుంచి నీటి విడుదల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టులున్నా, రైతులు నీటికోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. నిర్మల్ ప్రాంతంతో కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, 1990లో నిర్మల్ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఇకడికి వచ్చినప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారని గుర్తుచేశారు.
ప్రాజెక్టు గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, ఆయిలింగ్ లేకపోవడం, సిల్ట్ పేరుకుపోవడం వంటి సమస్యలను అప్పుడే గుర్తించారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారని తెలిపారు. తెలంగాణకు నీళ్లు అందించాల్సిన ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఆ పరిస్థితిని మార్చాలని కేసీఆర్ తపించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర సాధన తర్వాత సాగునీటి రంగ అభివృద్ధిలోనూ నిర్మల్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోయిన పరిస్థితి నుంచి మళ్లీ నీటితో కళకళలాడేలా చేయడంలో కేసీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. గోదావరి జలాలను పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని శ్రీరాంసాగర్ వరకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
గోదావరి, కృష్ణా నదుల్లోని నీళ్లు ఏపీకి వదిలి పెట్టిన్రు. తెలంగాణ రైతాంగానికి కన్నీళ్లు మిగిల్చిన్రు. ఆనాడు మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిన్రు. ఆరు గ్యారెంటీల పేరిట భ్రమలు కల్పించిన్రు. ఇప్పుడు గద్దెనెక్కి నిండా ముంచుతున్రు. మాయమాటలు నమ్మి కలుపు మొక్కలాంటి కాంగ్రెస్‌ను నెత్తిమీద పెట్టుకుంటే దరిద్రం మన గడపతొక్కింది.
-కేటీఆర్
చెరువులకు పూర్వవైభవం.. ప్రాజెక్టులతో సాగుకు ఊతం
చెరువు బాగుంటే దానిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు, ఇతర వృత్తుల వారికి ఉపాధి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని 46 వేల చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ చేపట్టిందని వివరించారు. చెరువుల పునరుద్ధరణతో పాటు వాటిపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బోథ్ నియోజకవర్గంలోని అల్లూరు చెరువు సుమారు 3,500 నుంచి 4,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, దానిని కూడా మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని వినియోగించుకునేలా కేసీఆర్ ప్రభు త్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పారు.

11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు
రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచనతో దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల్లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులేనని, వారు వ్యవసాయంలో నష్టపోతే మొత్తం కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం అందించామని వివరించారు. మొత్తం 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి ఆర్థిక భరో సా ఉండాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు.
2 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడు విడతలుగా నిలిపివేసిన రైతుబంధు బకాయిలతోపాటు ప్రస్తుత యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని, మిగిలిపోయిన రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న 36 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంటలు కొనరు.. యూరియా ఇవ్వరు
రైతులకు పెన్షన్లు, రైతుభరోసా, కల్యాణలక్ష్మీ వంటి పథకాలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కేటీఆర్ ప్రస్తావించారు. రైతుభరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని పేదలకు, ఉపాధి హామీ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, కౌలు రైతులకు ప్రయోజనం వంటి హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. మూడు విడుతలుగా రైతుబంధు డబ్బులు నిలిపివేసిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. రైతుబీమా నిలిపివేశారని, యూరియా అందుబాటులో లేకుండా చేశారని మండిపడ్డారు. రైతులు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ హామీలు అమలయ్యాయా? సోయాబీన్‌కు బోనస్ వచ్చిందా? అని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సుమారు 90 శాతం పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పకనబెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికలకు ఇంకా రెండేండ్లకు పైగా సమయం ఉన్నది. అయినా ఎన్నికలు లేని సమయంలో కూడా రాజకీయ కారణాలతో కేసీఆర్‌కు పేరు రావొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది దేవుడిచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. పాలకుల వికృతితో వచ్చిన కరువు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పంపులు ఎందుకు ఆన్చేయలేదు?
‘రేవంత్‌రెడ్డీ నిర్మల్ సభ సాక్షిగా, వేలాదిమంది రైతుల సమక్షంలో సూటిగా అడుగుతున్నా.. పట్టిసీమ వద్ద చంద్రబాబు నీళ్లు ఎత్తిపోస్తుంటే నువ్వు కన్నెపల్లి, దేవాదుల వద్ద గోదావరి నదిమీద ఉన్న పంపులను ఎందుకు ఆన్చేయలేదు?’ అని కేటీఆర్ నిలదీశారు. శ్రీశైలం నుంచి 750 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు వెళ్తే, పక్కనే ఉన్న పాలమూరు రైతుల పొలాలు ఎందుకు ఎండుతున్నాయో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము జూలైలో కన్నెపల్లికి పోయి, అక్కడ పారుతున్న నీళ్లను చూశామని, వాటిని ఎత్తుమని ముఖ్యమంత్రిని బతిమాలామని, చిలుకకు చెప్పినట్టు చెప్పినా ముఖం చాటేశారని మండిపడ్డారు. ఆనాడు నీళ్లు ఎత్తిపోసుకొని ఉంటే ఎస్సారెస్పీలో ఇప్పుడు 90 టీఎంసీల నీళ్లు ఉండేవని పేర్కొన్నారు. అక్కడి నుంచి సరస్వతీ కెనాల్‌కు, అక్కడి నుంచి సదర్మాట్కు తరలించుకొనే అవకాశం ఉండేనని స్పష్టంచేశారు. ‘ఆంధ్రా ప్రాజెక్టులు ఎందుకు నీళ్లతో కళకళలాడుతున్నాయి? మన ప్రాజెక్టులు ఎందుకు ఎండినయ్? ఆంధ్రాకు నీళ్లు.. మనకు ఎక్కిళ్లు ఎందు కు?’ అని రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
కలుపుమొక్కలాంటి కాంగ్రెస్
కలుపుమొక్కలాంటి కాంగ్రెస్‌ను, దేశమంతా వదిలించుకున్న దరిద్రపు పార్టీని నెత్తిమీదపెట్టుకుంటే దరిద్రం మన గడపతొక్కిందని కేటీఆర్ తూర్పారబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోలను చూపుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ‘ఆనాడు మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిన్రు.. ఆరు గ్యారెంటీల పేరిట భ్రమలు కల్పించిన్రు.. ఇప్పుడు గద్దెనెక్కి నిండా ముంచుతున్రు’ అని మండిపడ్డారు. ‘మూడుసార్లు రైతుంబంధు ఎగొట్టింది వాస్తవం కాదా? రైతుబీమా ఎత్తేసింది నిజం కాదా? బంగారంలాగా కల్లాలకాడికొచ్చే యూరియాను దొరుకకుండా చేసింది వాస్తవంకాదా? పంటలు కొంటలేని మాట వాస్తవంకాదా?’ అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. వారి నుంచి ‘అవును.. అవును..’అని ముక్తకంఠంతో సమాధానం వచ్చింది. బోనస్‌ను బోగస్ చేసిన ప్రభుత్వం ఆఖరికి పండించిన పంటలు కూడా కొనకుండా రైతాంగాన్ని అరిగోస పెడుతున్నదని ధ్వజమెత్తారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అష్టగ్రహాలు
రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, వీరంతా అష్టగ్రహాలు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు అష్టకష్టాల్లో ఉంటే వీళ్లంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు, సీట్లు కావాలి. మరి తెలంగాణకు పైసలిచ్చే సోయి లేదా? మోదీ హృదయంలో తెలంగాణకు స్థానం లేదా? తెలంగాణకు ఎందుకు పైసలివ్వడం లేదని మోదీ ఇంటి ముందు ధర్నా చేసే ధైర్యం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక పార్టీ చెప్పులు మోస్తే, మరో పార్టీ సంచులు మోస్తున్నదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో రెండు పార్టీలు దొందూదొందే అని చురకలు అంటించారు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీఎల్పీ నేతగా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీని రోడ్లపై అడ్డగిస్తే, మహిళా ఎమ్మెల్యేలను జుట్టు పట్టి గుంజినా ఆయన మాట్లాడటం లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. పక్క రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్రకు కరువు బృందాలను పంపుతున్న మోదీకి తెలంగాణలో కరువు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఎల్ నినో దేవుడిచ్చిన కరువు కాదు. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ప్రకృతి పగబడితే వచ్చిన కరువు కాదు. పాలకుల వికృతి తెచ్చిన కరువు. నదుల్లో బంగారంలాగా పారుతున్న నీళ్లను కేసీఆర్‌పై కక్షతో దిగువకు వదిలిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌పై కక్షతో ఇంత చిల్లర రాజకీయం చేస్తావా? ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇంతగా దిగజారాలా? రైతులపై పగబడుతావా? రైతుల జీవితాలకంటే రాజకీయ ప్రయోజనమే నీకు ముఖ్యమా? ఎన్నికలు మరో రెండేండ్లున్నాయి. కేసీఆర్ చేసిందేందో, కాంగ్రెస్ ఉద్ధరించిందేందో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎన్నికలు లేకున్నా రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నిర్మల్‌కు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలే
నిర్మల్‌లో ఎన్నికల ముందు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ, వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, రైల్వే లైన్, ఉపాధి కల్పన, పేద ప్రజలకు పట్టా భూములు, ఉన్నత విద్యాసంస్థలు తెస్తానని బీజేపీ ఎమ్మెల్యే హామీలు ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బీడీ పింఛన్ల ఘనత కేసీఆర్‌దే
దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీడీ కార్మికులకు పింఛన్ల ఇస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోనే తొలిసారిగా బీడీ కార్మికులకు పింఛన్ల తెచ్చింది.. నిర్మల్ జిల్లాలో 63 వేల మందికి బీడీల పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. 2017లో బీడీ పరిశ్రమపై ప్రధాని మోదీ జీఎస్టీ వేస్తే అడ్డుకున్న నాయకుడు కేసీఆర్‌నని గుర్తుచేశారు. నిర్మల్ జిల్లాలో ఉన్న ఆడబిడ్డలు, బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లు ఏది మంచో, ఏది చెడో ఆలోచించాలని కోరారు. మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఎక్కడ? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో మైనారిటీ గురుకులాలు ఆగమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థులు చనిపోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
కేసీఆర్ హయాంలోనే పోడు పట్టాలు
పూర్వ ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం పుట్టిన గడ్డ అని కేటీఆర్ గుర్తుచేశారు. గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. గిరిజన రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచింది ఆయనేనని చెప్పారు.
నాడు ఈస్ట్‌మన్ కలర్.. నేడు తెల్లముఖం
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఈస్ట్‌మన్ కలర్ చూయించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా తెల్లముఖం వేశారని కేటీఆర్ చురకలు అంటించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీలు, విద్యాభరోసా కార్డు కింద రూ.5 లక్షలు ఎక్కడ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తానని చెప్పారని, పీఆర్సీ, ఏడు డీఏలు బాకీపడ్డారని తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని రైతు గర్జన వేదికగా డిమాండ్ చేశారు.
ఉద్దెర మాటలు, ఉపన్యాసాలతో కడుపు నిండదు. మీరు మూడుసార్లు ఎగ్గొట్టిన రైతుబంధును జమచేయాలి. రైతుల పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలి. మిగిలిన రైతు రుణమాఫీని పూర్తిచేయాలి. పనుల్లేక ఆగమైతున్న రైతుకూలీలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా వారి ఖాతాల్లో నెలకు రూ.1,000 చొప్పున ఎగ్గొట్టిన 36 నెలలకు రూ.36 వేలు జమచేయాలి.
-కేటీఆర్
నిర్మలమైన మనసుతో ఆలోచించండి
నిర్మల్‌లో కొందరు నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోయినా.. పార్టీని కాపాడుకున్న కార్యకర్తలు, గులాబీ దండుకు కేటీఆర్ చేతులెత్తి ధన్యవాదాలు తెలిపారు. నాయకులు వస్తారు, పోతారని, కానీ కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు అని కొనియాడారు. పార్టీలోకి వినయ్‌రెడ్డి రావడంతో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. ఆయనతోపాటు పార్టీలో చేరిన మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు పదేండ్ల కేసీఆర్ పరిపాలన, మూడేండ్ల కాంగ్రెస్ పాలనను చూసి నిర్మల్ ప్రజలు నిర్మలమైన మనసుతో ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులను కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని.. ఢిల్లీ పార్టీలకు గుణపాఠం తప్పదని, ఆ రెండు పార్టీలను ఢిల్లీ వరకు ఉరికించడం ఖాయమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని చెప్పా రు. మోసపోతే గోస పడుతామని ఆనాడు కేసీఆర్ చెప్పారని ఆ పరిస్థితులను కండ్లారా చూస్తున్నామని ఈ పరిస్థితులు మారాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని చెప్పారు. తెలంగాణ ప్రగతిరథం మళ్లీ పట్టాలెక్కాలంటే రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టంచేశారు.
ఎవరన్నా రేవంత్‌లా కావాలనుకుంటారా?
కరువుపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు వేయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వరి వేయొద్దని రేవంత్‌రెడ్డి అంటున్నడు. నీళ్లు, కరెంట్ ఇస్తా అంటలేడు. ధైర్యం చెప్తలేడు. ఆయనకు కరువుగానీ, రైతుల కష్టంగానీ కనిపిస్తలేవు. ఆయనకు ఒకే ఒక సమస్య ఉన్నది. మొన్న కొడంగల్‌లో మీటింగ్ పెట్టి రైతుల సమస్యల గురించి, నీళ్ల కష్టాల గురించి, కరువు సాయం గురించి మాట్లాడి రైతులకు ధైర్యం చెప్తాడేమో అనుకున్నాం. ఎగ్గొట్టిన రైతుబంధు ఇస్తనని చెప్తాడేమో అనుకున్నారు. ఆయనకు రైతుల సమస్యలు పట్టవట. కానీ కేటీఆర్ పెంచుకొన్న గడ్డం మీద ఫికర్ పెట్టుకున్నడు’ అంటూ పంచులు విసిరారు.
‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులికాదని అన్నడు. నేను రేవంత్‌రెడ్డిలాగా కావాలని అనుకుంటున్నానట. నేను అడుగుతున్నా.. అన్నలారా, తమ్ములారా మిమ్మల్ని మీలో ఎవరైనా రేవంత్‌రెడ్డి లాగా కావాలని కోరుకుంటున్నరా? బుద్ధి ఉన్న వారేవరైనా అలా కోరుకుంటారా? ఆయనను తిట్టే తిట్లకు బుద్ధి ఉన్నోడెవడైనా బకెట్ నీళ్లలో దూకి సచ్చిపోతుండే. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉన్నయని రేవంత్‌రెడ్డిని తిడుతుంటేనే తెలిసింది. అలాంటిది ఆయనను నేను నకలు కొడ్తున్ననని గొప్పలు చెప్పుకొంటున్నడు’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎల్ నినో వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే పరిస్థితి ఇట్లనే ఉండేదా? ప్రజలు ఆలోచించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

