మంత్రుల పిల్లల విదేశీ విద్య
ఇటీవల కేంద్ర మంత్రుల పిల్లల విద్యా నేపథ్యంపై వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. కేంద్ర మంత్రుల పిల్లల్లో 15 మంది ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నట్టు ప్రచారం జరిగింది.
భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విశ్వగురువుగా నిలబెడుతామని మోదీ నాయకత్వంలోనికేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేండ్లుగా ఊదరగొడుతున్నది. అంతర్జాతీయ వేదికలపై మన దేశ ఘనతను ఎంతో గొప్పగా చాటుకుంటున్నది. ఆత్మనిర్భర్ భారత్, నూతన భారతదేశం, విశ్వగురు భారత్ అంటూ నినాదాలు చేస్తున్నది. కానీ ఈ ప్రచారానికి, దేశంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని పరిశీలిస్తే తీవ్ర ఆందోళన కలుగుతున్నది.
ఇటీవల కేంద్ర మంత్రుల పిల్లల విద్యా నేపథ్యంపై వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. కేంద్ర మంత్రుల పిల్లల్లో 15 మంది ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నట్టు ప్రచారం జరిగింది. వీరిలో కొందరు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అయితే దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతామని చెప్తున్న పాలకవర్గానికి చెందిన కుటుంబాలే తమ పిల్లల ఉన్నత విద్య కోసం విదేశీ విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంటే.. దేశంలోని విద్యావ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉన్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక రైతు బిడ్డకు, కార్మికుడి బిడ్డకు, దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థికి విదేశీ విద్య ఎందుకు అందడం లేదు?
విదేశీ విద్య కోసం రూ.కోట్లు ఖర్చు చేయగలిగే కుటుంబాలు ఒకవైపు ఉంటే, ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పేద విద్యార్థులు మరోవైపు ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక అసమానత కాదు. విద్యావకాశాల్లో ఉన్న సామాజిక అసమానతకు అద్దం పడుతున్న పరిస్థితి. దేశంలో బీజేపీ పాలనలో సామాజిక అసమానతలు తీవ్రస్థాయిలో పెరుగడానికి ఈ విధానాలు కూడా కారణం కాదా? నీతి ఆయోగ్ 2025 డిసెంబర్లో ప్రచురించిన Internationalisation of Higher Education in India నివేదికలోని గణాంకాలు విద్యార్థులను, యువతను ఆలోచింపజేస్తున్నాయి. 2016లో విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల సంఖ్య 6.84 లక్షలు ఉండగా, 2024 నాటికి అది 13.35 లక్షలకు చేరింది. అంటే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నివేదిక ప్రకారం, 202122లో మన దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య 46,878 మాత్రమే. మరోవైపు, అదే సమయంలో 11.59 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. ఈ వ్యత్యాసం దేశ ఉన్నత విద్యావ్యవస్థకు, అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
విదేశీ విద్య కోసం భారతీయులు చేసే వార్షిక చెల్లింపులు 201314లో 0.16 బిలియన్ డాలర్ల నుంచి 202324లో దాదాపు 3.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే భారతీయ కుటుంబాలు విదేశీ విద్య కోసం భారీగా ఆర్థిక వనరులను వెచ్చిస్తున్నారు. దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థను ప్రపంచస్థాయి విద్యకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్రతివాచీలు పరచి స్వాగతం పలికింది తప్ప, ఈ దేశ మట్టి బిడ్డలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన నలంద, తక్షశిల వంటి ప్రాచీన విద్యా కేంద్రాల వారసత్వాన్ని మనం గర్వంగా చెప్పుకొంటాం. కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే ఆధునిక పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన అధ్యాపకులు, అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలు అవసరం. ప్రభుత్వం దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటును ప్రోత్సహించడం ఒక విధానం కావచ్చు. కానీ అదే సమయంలో మన ప్రభుత్వ వర్సిటీలను కూడా ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి. విదేశీ సంస్థలను ఆహ్వానించడం మాత్రమే అంతర్జాతీయ విద్యా కేంద్రంగా ఎదగడానికి సరిపోదు. మన విద్యార్థులు విదేశాలకు వెళ్లే పరిస్థితిని తగ్గించడానికి దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పరిశోధన ఫెలోషిప్‌లు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తగిన నిధు లు, అధ్యాపక నియామకాలు, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రభుత్వ వర్సిటీల్లో అధ్యాపకుల ఖాళీలు, పరిశోధనలకు పరిమిత నిధులు, పాతబడిన పాఠ్యప్రణాళికలు, ఆధునిక ప్రయోగశాలల కొరత, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించలేకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థను ఆధునికీకరించడంలో కేంద్రం విఫలమవుతున్నది.
PRS Legislative Research విశ్లేషణ ప్రకారం, 2025 జనవరి నాటికి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మంజూరైన బోధనా పోస్టుల్లో 29 శాతం ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టుల్లో 56 శాతం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 38 శాతం ఖాళీలు ఉన్నాయి. ఒకవైపు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుతూనే, మరోవైపు మన వర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండటం చూస్తే ఉన్నత విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నది. విద్యకు, ఉపాధికి విడదీయలేని సంబంధం ఉన్నది. దేశంలో చదువుకున్న యువతకు తగిన ఉద్యోగాలు లభించకపోతే వారు విదేశాల వైపు చూస్తారు. అక్కడ చదువుతోపాటు ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశాలు కనిపిస్తాయి. ఇది భారత్‌కు మానవ వనరుల నష్టం కలిగించే ప్రమాదం అవుతుంది. విద్యావంతులైన యువత దేశంలోనే పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో పనిచేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఈ పుష్కర కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్న పాలకులు తమ దేశంలోని విద్యాసంస్థలపై ప్రజలకు ఎందుకు నమ్మకం కల్పించలేకపోతున్నారు. విశ్వగురు బిరుదు ప్రచారంతో కాదు.. విశ్వవిద్యాలయాల ప్రమాణాలతో వస్తుంది. దేశ ప్రజలకు నాణ్యమైన విద్యను అందించి, విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కల్పించినప్పుడే ఆ గౌరవం దక్కుతుంది. ముందుగా దేశంలోని విశ్వవిద్యాలయాలను విశ్వస్థాయికి తీసుకెళ్లండి. స్వదేశంలోనే ప్రపంచస్థాయి విద్యను అందించండి. అదే నిజమైన ఆత్మనిర్భర్ భారత్.. అదే నిజమైన విశ్వగురు భారత్.
డాక్టర్ ఆవాల హరిబాబు
98495 38813
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

