చార్మినార్, డిసెంబర్ 3 : మెరుగైన చికిత్సలు అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం ఆయన చార్మినార్ నియోజకవర్గంలోని పురానాపూల్ డివిజన్ కసరట్టాలో బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి మెరుగైన వైద్యం అందించాలనే బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చారాన్నారు. స్పెషలైజేషన్ చికిత్సలైన మధుమేహం, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, అప్తమాలజీ, డెంటల్ వ్యాధులకు చికిత్స లభిస్తున్నాయని తెలిపారు. రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు చేరుస్తారని, అక్కడి రిపోర్టుల ఆధారంగా చికిత్సలు అందుతాయన్నారు.
కొవిడ్ సంచార వాహనం..
కసరట్టాలోని బస్తీ దవాఖాన ఆవరణలోనే కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కొనసాగనుందని డిస్ట్రిక్ ఇమ్యూనోలజీ ఇన్చార్జి డాక్టర్ శ్రీకళ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ పొందాలని సూచించారు. కసరట్టాలోని బస్తీ దవాఖాన ఆధ్వర్యంలో రెండు మొబైల్ వ్యాక్సిన్ సంచార వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంచార కొవిడ్ వాహనాలు కేర్ ఇండియా ఆర్గనైజేషన్ అందించారని తెలిపారు. కార్యక్రమంలో పురానాపూల్ కార్పొరేటర్ సున్నం రాజ్‌మోహన్, టీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి పుస్తె శ్రీకాంత్, పుప్పాల రాధాకృష్ణ, గోపీనాథ్ యాదవ్, గోపీగౌడ్, గుంటి మంజుల, ఎస్.సి.హెచ్.ఓ. డాక్టర్ సునంద, సెంటర్ ఇన్చార్జి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్లు ఫిర్దోస్ ఫాతిమా, ఆరీఫ్ పాల్గొన్నారు.
బస్తీ దవాఖానలను ప్రారంభించి నాంపల్లి, కార్వాన్ ఎమ్మెల్యేలు
మెహిదీపట్నం, డిసెంబర్ 3 : మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని,ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్‌రావు అన్నారు. శుక్రవారం నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్ జాకీర్ హుస్సేన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, టీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ -12 డిప్యూటీ కమిషనర్ ఇన్కెషాఫ్ అలీ, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి జాఫర్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.
టోలిచౌకి రేషంబాగ్లో..
కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి డివిజన్ రేషం బాగ్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, డిప్యూటీ కమిషనర్ వి.నర్సింహ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనూరాధ, ఏఎంఓహెచ్ డాక్టర్ అనిల, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దవాఖానలోని వైద్యసేవల వివరాలను ఎమ్మెల్యే వాకబు చేశారు. ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చెప్పారు.