ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్‌జోన్, ప్రాణాహిత నది పరీవాహక ప్రాంతాల్లో పులుల సంచారం ఇటీవల గణనీయంగా పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతాల నుంచి పులులు తరచూ జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు అటవీశాఖ అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో వెంటనే అప్రమత్తమై, పులుల ఆవాసాలను పెంచే చర్యలు చేపట్టింది. వాటికి ఆహారంతో పాటు నీటి వసతి కల్పించి, సంరక్షణ ఏర్పాట్లు చేసింది. గతంతో పోలిస్తే ఈ మూడేళ్లలో పులుల కదలికలు పెరిగాయని, వాటి సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్, మార్చి 18( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతమైన కడెం, జన్నారం, ఖానాపూర్‌తో పాటు మహారాష్ట్ర సరిహద్దుల వెంట విస్తరించిన అడవుల్లో కొంత భాగాన్ని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంగా పిలుస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలను కలిపి టైగర్ కారిడార్‌గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పులుల సంచారం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ భూభాగంలో వన్యప్రాణులతో పాటు పెద్దపులుల వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. కవ్వాల్ ప్రాంతాన్ని పెద్దపులులకు ఆవాసయోగ్యంగా మారుస్తున్నారు. నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వేట కోసం జింకల సంతతిని పెంచుతున్నారు. స్థానిక గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యత తెలిపేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం పెరగడంతో పులుల కదలికలు కూడా పెరిగాయి. జిల్లాలకు సరిహద్దులో ఉన్న తడోబా అటవీ ప్రాంతాల నుంచి పులులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వస్తున్నాయి. మూడేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ టైగర్‌జోన్‌తో పాటు, ప్రాణాహిత, పెన్‌గంగ సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం బాగా పెరిగింది. సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో పులులు పశువులపై దాడి చేస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో కూడా అధికారులు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని పులులు ఆవాసం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని జింకలను తీసుకువచ్చి కవ్వాల్ అడవుల్లో వదిలివేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. అడవుల్లో శాకాహార జంతువులకు ఆహారం సమకూర్చుతున్నారు. గడ్డి పెంపకాలను చేపట్టడంతో పాటు కుంటలు, ఇతర పనుల ద్వారా నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వం అడవుల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కలప అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు అటవీశాఖలో వివిధ అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టింది. అడవుల సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతం చుట్టూ కందకాలను తవ్వడంతో గచ్చికాయల చెట్లను పెంచుతున్నారు. కలప రవాణా జరగకుండా వివిధ రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు సాయుధ పోలీసులు విధులు నిర్వర్తిస్తూ స్మగ్లర్లపై నిఘా పెడుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలప రవాణాకు చెక్‌పడింది. హరితహారంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపట్టడం, ఏఎన్ఆర్ విధానంలో అడవులు సహజంగా పెరిగేలా చర్యలు తీసుకోవడంతో అటవీ విస్తీర్ణం సైతం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాలు పక్షులు, శాకాహార, మాంసహార జంతువులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జంతుగణనలో సైతం జిల్లాలో పలు జంతువుల సంఖ్య పెరిగినట్లు గుర్తించింది.