
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులో ఆదినుంచి వివక్ష చూపుతున్న మోదీ సర్కారు మళ్లీ తన పక్షపాత బుద్ధిని బయటపెట్టింది. తెలంగాణకు రావాల్సిన ఆరోగ్యరంగ నిధులను నిలిపేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం 19 రాష్ర్టాలకు కేంద్రం రూ.8,453.92 కోట్లు విడుదల చేసింది. అందులో ఏపీకి రూ.488.16 కోట్లు ఇచ్చింది. బీజేపీ సర్కారు ఆది నుంచి తెలంగాణపై పక్షపాతాన్ని చూపుతున్నది. రాష్ట్ర అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేంద్రం వివక్షను ఎండగట్టకుండా, నిధుల కోసం పట్టుబట్టని రాష్ట్ర బీజేపీ నేతలు.. తిరిగి తెలంగాణ సర్కారుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం. నిధులు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే.. ప్రతిపాదనలు రాలేదని కేంద్రం డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నది. గతంలోనూ.. ‘మీరు అడగలేదు కనుక ఇవ్వలేదు, ప్రతిపాదనలు సరిగ్గా లేక ఇవ్వలేదు’ అంటూ ఏవో సాకులు చెప్తున్నది.