హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్లాల నుంచి వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ.. 20 వేల పోస్టులతో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేదంటే రెండు రోజుల తరువాత దిల్‌సుఖ్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్ష చేపడుతామని హెచ్చరించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగుల గోస పట్టదా? 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. కేవలం ఏడు వేల పోస్టులను నిరుద్యోగులకు భిక్షంగా వేస్తరా? 20 వేల పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దిల్‌సుక్‌నగర్‌లో పాలాభిషేకం చేస్తం.
లేదంటే నీ రాజకీయ జీవితానికి పాడె కట్టి ఊరేగిస్తం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి, నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే నిరుద్యోగులు తమ ఓట్లతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడుతారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో’ ఉద్యమాన్ని చేపడుతామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రతి చౌరస్తాలో డప్పు చప్పుళ్లతో నిరుద్యోగ ఉద్యమం నిర్మిస్తామని చెప్పారు.
ఓయూ జేఏసీ నేత వినోద్ నాయక్ మాట్లాడుతూ.. తమ డిమాండ్ల మేరకు అన్ని ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి తిరుతామని హెచ్చరించారు. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేయకపోతే తెలంగాణతోపాటు ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌లో ‘కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా 73 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిన రేవంత్‌రెడ్డికి.. తెలంగాణ నిరుద్యోగుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు.
పోలీసు ఉద్యోగాలతోపాటు జీపీవో, మెగా డీఎస్సీ, గ్రూప్స్ పోస్టులు విడుదల చెయ్యాలని, లేకపోతే నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ సర్కార్‌ను అదే ఓట్లతో బొందపెడ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ యువకులు తమ ఆవేదన అందరితోనూ పంచుకున్నారు. ‘20 వేల ఉద్యోగాలు అడిగితే.. ఏడు వేల ఉద్యోగాలిస్తారా? ’అని ఆవేదన వ్యక్తంచేశారు.
నాడు తన రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను రెచ్చగొట్టి, స్వలాభం కోసం వాడుకొన్నారని నిరుద్యోగులు విమర్శించారు. నాడు రాహుల్‌గాంధీని అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు అదే రాహుల్‌గాంధీని తీసుకొచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని తీసుకొస్తే సమస్యలు ఆయనకు వివరిస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే జీవో-46ను రద్దు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. జీవో-46ను రద్దు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. ఎస్ఐ ఉద్యోగాలకు వయోపరిమితిని 38 ఏండ్లకు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని 36 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను ఏ దొంగలు ఎత్తుకుపోయారో ముఖ్యమంత్రి చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వచ్చే ఆగస్టుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండేండ్లు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్‌రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు.
నిరుద్యోగుల ఆందోళనలను పోలీసులతో అణచివేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మరొక నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వాటి ప్రకారమే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే.. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు ఝాన్సీ, కౌశిక్, రాజు, విక్రమ్, శ్రీనివాస్, రంగా నాయక్, సాయి ప్రణీత్, ప్రదీప్, నవీన్‌గౌడ్, వేలాదిగా నిరుద్యోగులు పాల్గొన్నారు.