హైదరాబాద్, సెప్టెంబర్29 (నమస్తే తెలంగాణ): ముందుగా ఎస్సీ కులగణన చేపట్టాలని, ఆ తర్వాతే వర్గీకరణ అమలుచేయాలని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎక్కువగా మాల, మాదిగలే లబ్ధిపొందారని, ఇతర వెనుకబడ్డ 57ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు, ఇప్పుడు తెలంగాణలో లేవని, ఎస్సీల సమగ్ర కులగణన నిర్వహిస్తేనే ఆయా కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుస్తాయని తెలిపారు. ఇప్పటివరకు జనాభా లెకల్లో ఎస్సీ, ఎస్టీలుగా గణిస్తున్నారే తప్ప.. ఉపకులాల వివరాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యమివ్వడం లేదని నొక్కిచెప్పారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వర్గీకరణ అమలుకు సమాలోచనలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయని, అదే నిజమైతే ఉపకులాలకు మరోసారి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.