CM KCR Maharashtra Tour | కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో ఆదివారం ముంబై పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని స్పష్టం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశ హితం కోసం కేసీఆర్ తో కలిసి నడుస్తాం. మాతో వచ్చే నేతలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.