రాజ్‌భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం ఎత్తుకుని.. గవర్నర్ నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వచ్చి బోనం సమర్పించారు. గవర్నర్ కుటుంబసభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్ పరివార్‌కు చెందిన మహిళలు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. యావత్ దేశం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తమిళిసై తెలిపారు.
హైదరాబాద్ సంప్రదాయ పద్ధతిలో బోనాలను ఎత్తుకుని, జాతర తరహా మేళతాళాలతో గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
గవర్నర్ స్వయంగా బోనం ఎత్తుకొని రావడం, సిబ్బంది ఊరేగింపుగా రావడంతో రాజ్ భవన్లో బోనాల పండుగ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ లు భవాని శంకర్, రఘు ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.