రాంచీ: నీటి ఏనుగు లేదా నీటి గుర్రంగా పిలిచే హిప్పోపొటామస్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సంరక్షకుడు మరణించాడు. (Hippopotamus Attacks) ఈ నేపథ్యంలో ఆ జూలోని మిగతా కేర్టేకర్లు నిరసన వ్యక్తం చేశారు. జార్ఖండ్ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. రాంచీలోని భగవాన్ బిర్సా బయోలాజికల్ పార్క్‌లో ఒక హిప్పోపొటామస్ ఇటీవల ఒక పిల్లకు జన్మనిచ్చింది. శుక్రవారం 54 ఏళ్ల జంతు సంరక్షకుడు సంతోష్ కుమార్ మహతో ఆ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. పుట్టిన పిల్లను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో తల్లి హిప్పోపొటామస్ అతడిపై దాడి చేసింది.
కాగా, తీవ్రంగా గాయపడిన జూ కేర్‌టేకర్ సంతోష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. జూ డైరెక్టర్ జబ్బర్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విధుల్లో ఉండగా మరణించిన సంతోష్ కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు.
మరోవైపు నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడిలో మరణించిన వ్యక్తికి రూ. 4 లక్షల పరిహారం కూడా లభిస్తుందని జూ డైరెక్టర్ జబ్బర్ సింగ్ తెలిపారు. సంతోష్ ఆసుపత్రి ఖర్చులను జూ అథారిటీ భరిస్తుందని చెప్పారు. అలాగే అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ప్రయత్నిస్తామని అన్నారు.
కాగా, హిప్పోపొటామస్ దాడిలో జూ కేర్‌టేకర్ సంతోష్ కుమార్ మరణించడంపై మిగతా జూ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. జూ అథారిటీకి వ్యతిరేకంగా ప్రధాన గేటును మూసివేశారు. పర్మినెంట్, క్యాజువల్ సహా సుమారు 112 మంది సిబ్బంది ఆ జూలో పనిచేస్తున్నారు.