న్యూఢిల్లీ, మే 13: దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది. గత నాలుగు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎస్పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. 15-29 సంవత్సరాల వయసు గల మహిళల్లో నిరుద్యోగిత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 16.6 శాతం నుంచి జనవరి-మార్చి త్రైమాసికంలో 17.7 శాతానికి పెరిగింది.
15 ఏండ్లు, అంతకంటే తక్కువ వయసు వారిలో నిరుద్యోగిత రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.8 శాతం నుంచి జనవరి-మార్చిలో 5 శాతానికి పెరిగినట్లు కరెంట్ వీక్లీ స్టేటస్ రిపోర్టు తెలిపింది.
యువ పురుషులలో నిరుద్యోగిత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 13.5 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. సీడబ్ల్యూస్ విధానం ప్రకారం ఒక వ్యక్తి వారంలో ఏరోజైనా ఒక్క గంట కూడా పనిచేయకపోయినా, అదే వారంలో కనీసం ఒక గంట పాటు పని కోరినా లేదా పనికి అందుబాటులో ఉన్నా ఆ వ్యక్తిని ఆ వారంలో నిరుద్యోగిగా పరిగణిస్తారు.