న్యూఢిల్లీ: ఒక యువతితో మాట్లాడేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె ప్రియుడు అందుకు అనుమతించలేదు. దీంతో ఆ వ్యక్తి తన అనుచరులతో కలిసి యువతి ప్రియుడ్ని కత్తులతో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన (Delhi Shocker) జరిగింది. దక్షిణపురి ప్రాంతంలో నివసించే 18 ఏళ్ల రాహుల్‌కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో మాట్లాడేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. అయితే రాహుల్ దీనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అతడికి గుణపాఠం చెప్పాలని ఆ యువకుడు భావించాడు. ఈ నెల 11న రాత్రి పది గంటలకు అంబేద్కర్ నగర్ ప్రాంతంలోని ఎంబీ రోడ్డు వద్ద నలుగురు అనుచరులతో కలిసి రాహుల్‌పై దాడి చేశాడు. అతడ్ని కత్తులతో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి వారు పారిపోయారు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కత్తి గాయాలతో రక్తం మడుగులో పడి ఉన్న రాహుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్‌పై దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు 18 ఏళ్ల యువకులు కాగా, మిగతా ముగ్గురు మైనర్లని పోలీసులు వెల్లడించారు.
Also Read: