లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల ప్రచారపర్వం హోరెత్తుతోంది. గత ఐదేండ్లలో ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.
తమ హయాంలో యూపీ ఇన్వెస్టర్లకు మెరుగైన గమ్యస్ధానంగా మారిందని చెప్పారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని 12వ స్ధానం నుంచి రెండవ స్ధానంలో నిలబెట్టామని అన్నారు. గతంలో యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి నెలకొనగా ఇవాళ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు రాష్ట్రం వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో కాషాయ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో యూపీ పెట్టుబడుల గమ్యస్ధానంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోందని చెప్పారు.
యూపీ ఆర్ధిక వ్యవస్ధ దేశంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదిగిందని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఏడాదికి రూ 47,000 నుంచి రూ 54,000కు పెరిగిందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ రూ 2 లక్షల కోట్ల నుంచి రూ 6 లక్షల కోట్లకు ఎగబాకిందని యోగి వివరించారు. కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేయగలిగామని చెప్పారు. యూపీలో ప్రతి పౌరుడికి కరోనా సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తి కాగా 70 శాతం మంది టీకా రెండు డోసులూ తీసుకున్నారని చెప్పారు.