ప్రస్తుతం వాటికి విశ్రాంతినిచ్చాం
నాలుగున్నరేండ్లుగా దాక్కున్నవారు ఇప్పుడు రెచ్చిపోతున్నారు
వారిని గుర్తించి బుల్డోజర్లకు పని
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
మెయిన్‌పురి (యూపీ), ఫిబ్రవరి 18: గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇచ్చామని, మార్చి 10న ఫలితాలు వెల్లడై, మళ్లీ అధికారంలోకి రాగానే పని తిరిగి మొదలుపెడుతామని అన్నారు. ఈ మేరకు మెయిన్‌పురిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘మైనే బుల్డోజర్ బేజ్ దియా హే రిపేర్ కే లియే. మార్చి 10 కే బాద్ జబ్ యే ఫిర్సే చల్నా ప్రారంభ్ హోగా తో జిన్ లోగో మైన్ అబీ జ్యాదా గర్మీ నికాల్ రహీ హై, యే గర్మీ మార్చి 10 కే బాద్ అప్నే ఆప్ శాంతి హో జాయేంగీ (బుల్డోజర్లను మరమ్మత్తుల కోసం పంపించా. మార్చి 10 తర్వాత వాటిని మళ్లీ పంపిస్తా. ఎవరైతే ఇప్పుడు రెచ్చిపోతున్నారో.. అప్పుడు వాళ్లంతట వాళ్లే మౌనంగా ఉండిపోతారు)’ అని యోగి పేర్కొన్నారు. అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన నేరగాళ్ల ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తానన్న యోగి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తున్నదని ఓ సీనియర్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు తనకు గుర్తుచేశాడని యోగి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం బుల్డోజర్లకు విశ్రాంతి ఇచ్చానని, త్వరలోనే వాటికి పని చెప్తానని ఆయనతో తాను అన్నట్టు వివరించారు. క్రిమినల్స్‌కు ఎస్పీ రక్షణగా ఉంటున్నదని ధ్వజమెత్తారు.