Yoga Nidra | న్యూఢిల్లీ: యోగ నిద్ర చేస్తే మెదడులో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇందులో ఎంత అనుభవం ఉంటే అంత మెరుగైన ఫలితాలు పొందొచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఐఐటీ ఢిల్లీ, ఎయిమ్స్ ఢిల్లీ, మహజన్ ఇమేజింగ్కు చెందిన పరిశోధకులు కలిసి యోగ నిద్రపై అధ్యయనం జరిపారు. ఈ వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
యోగ నిద్ర చేస్తున్న వారి మెదడులో వస్తున్న మార్పులను ఎఫ్ఎంఆర్ఐ ద్వారా గుర్తించారు. యోగ నిద్రతో మెదడులో భావోద్వేగాలను, మనస్సు సంచారాన్ని నియంత్రించడం, జాగృతంగా ఉంటూనే లోతైన విశ్రాంతిలోకి వెళ్లడం వంటి మార్పులు వచ్చినట్టు పరిశోధకులు గమనించారు. యోగాలో అనుభవం లేని వారితో పోలిస్తే అనుభవం ఉన్న వారిలో ఈ మార్పులు ఎక్కువ ఉన్నట్టు తేల్చారు.