Anand Mahindra | సాంకేతికంగా ఏదైనా కొత్తది వచ్చిందంటే చాలు నెటిజన్లు దాన్ని అంత ఈజీగా వదలరు కద.. మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జిబ్లీ వంతు వచ్చింది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసినా జిబ్లీ స్టైల్ ఇమేజ్లే దర్శనమిస్తున్నాయి.
చాట్‌జీపీటీలో ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్ జెనరేటర్ ‘జీబ్లీ’ స్టూడియో. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్.. ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలే కనిపిస్తున్నాయి. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్ చిత్రాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫొటోను జిబ్లీ స్టైల్లో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో మహీందా ఓ బైక్‌పై వెళ్తున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎలా చేయాలో చేర్చుకోవాలి అంటూ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి.
😄
Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv
— anand mahindra (@anandmahindra) April 3, 2025
ఎడారి వేడి గాలిని సూచించే లిబియన్ అరబిక్ పదం నుంచి జిబ్లీ అనే పదం వచ్చింది. జపనీస్ యానిమేషన్ స్టూడియో జిబ్లీని 1985లో హయావో మియాజకి, ఇసావో టకహట, తోషియో సుజుకి స్థాపించారు. చేతితో గీచే యానిమేషన్, సంక్లిష్టమైన బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఈ స్టూడియో ప్రసిద్ధి పొందింది. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమ సృజనాత్మకతతో సృష్టించే కంటెంట్ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నది.
ఇక దీని ట్రెండ్ విపరీతంగా కొనసాగుతుండటంతో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్.. నెటిజన్లకు కీలక విజ్ఞప్తి చేశారు. దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లను ఆయన కోరారు. యూజర్లు అత్యధికంగా జిబ్లీని వాడుతుండటంతో తమ కంపెనీ వనరులు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. జీపీయూలు కరిగిపోతున్నాయన్నారు. ఈ ఫీచర్‌కు తాత్కాలికంగా స్పీడ్ లిమిట్స్ పెడుతున్నట్లు తెలిపారు. ‘జిబ్లీ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుంది. మా సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా!’ అని ఆయన అన్నారు.
Also Read..
Studio Ghibli | ఘిబ్లీ సృజన అదరహో.. ప్రభంజనం సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్
“Sam Altman | జిబ్లీ వాడకం తగ్గించరూ..ప్లీజ్.. నెటిజన్లను కోరిన ఆల్ట్‌మన్”