X accounts : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత పాకిస్థాన్ (Pakistan) కు వ్యతిరేకంగా భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రీడాకారులు సహా పలువురి సోషల్ మీడియా ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేసింది. తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ల ఎక్స్ ఖాతాలను నిలిపేసింది.
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపేసింది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన 16 ఛానెళ్లపై కూడా వేటుపడింది.
పహల్గాం ఉగ్రదాడిపై ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో భారత్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాక్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో సైతం ఇదే విధంగా భారత్‌పై నోరు పారేసుకున్నారు. సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆ ఇద్దరి ఖాతాలను భారత్ బ్లాక్ చేసింది.