న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో విడుదలయ్యే ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ నిర్ణయించింది. పశువులు విడుదల చేసే అపానవాయువు మీథేన్‌ను కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులతో పోరాడటం కోసం కొన్ని నెలలపాటు చర్చలు జరిపింది. రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్లు, పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా జూన్‌లో త్రైపాక్షిక ఒప్పందాన్ని ప్రకటించింది. ఒక టన్ను మీథేన్ విడుదల అయితే రైతులు 43 డాలర్లు (దాదాపు రూ.3,627) చెల్లించవలసి ఉంటుంది. ఇది 2030 నుంచి అమల్లోకి వస్తుంది. 2035నాటికి ఈ పన్నును రెట్టింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.