వడోదర : (Aircraft restaurant) విమానంలో ప్రయాణించడమంటేనే ఒక థ్రిల్. జీవితంలో ఒక్కసారైనా విమానాంలో ప్రయాణించాలని కలలు కనే వారు కోకొల్లలు. నిజమైన విమానంలో ప్రయాణించే అవకాశం పొందలేని వారి కోసం.. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కూర్చుని ఆహారం తీసుకుంటూ నిజమైన విమానంలో ఉన్నట్లుగా అనుభూతి పొందవచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి రెస్టారెంట్లు 8 ఉండగా, 9 వ రెస్టారెంట్ గుజరాత్‌లోని వడోదరలో ప్రారంభమైంది. మన దేశంలో ఇది నాలుగోది. వడోదరతో పాటు పంజాబ్‌లోని లూథియానా, హర్యానాలోని అంబాలా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు ఉన్నాయి.
ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ వడోదర నగరంలోని తర్సాలి బైపాస్‌లో నిర్మించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.1.40 కోట్లకు ఎయిర్ బస్ 320 స్క్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు చేసినట్లు రెస్టారెంట్ యజమాని ఎండీ ముఖి తెలిపారు. విమానంలోని కొన్ని భాగాలను విడదీసి వడోదరకు తరలించి రెస్టారెంట్‌గా మార్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రాజెక్ట్ ప్రారంభించడంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు ఆలస్యమైంది. ఎయిర్‌క్రాఫ్ట్‌కు రెస్టారెంట్ రూపాన్ని అందించడానికి దాదాపు రూ.60-65 లక్షల అదనపు వ్యయం జరిగిందని, మొత్తం ఖర్చు రూ.2 కోట్లకు చేరుకున్నదని ముఖి తెలిపారు. దీనిలో అన్ని సెన్సార్లు విమానంలో మాదిరిగానే ఇన్స్టాల్ చేశారు. వెయిటర్ని పిలవడానికి ఫ్లైట్లోలాగా సెన్సార్లు అమర్చారు.
అతిథులకు ఫీల్ వచ్చేందుకు మధ్యమధ్యలో టేకాఫ్ అవుతున్నట్లు విమానాన్ని కదిపే ఏర్పాట్లు చేశారు. అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది. ఈ రెస్టారెంట్లో వెయిటర్లు, సర్వర్లు ఎయిర్ హోస్టెస్, స్టీవార్డెస్‌ల వలె కనిపిస్తారు. దీని వల్ల విమానంలో కూర్చోవడం లాంటి అనుభూతిని ఇక్కడికి వచ్చేవారు పొందుతారని నిర్వాహకులు చెప్తున్నారు. పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, థాయ్, మెక్సికన్ వంటకాలను ఈ రెస్టారెంట్లో ఆందుబాటులో ఉంచారు.
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..