ముంబై : ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స్టేషన్‌ను వైష్ణవ్ సందర్శించి, క్షేత్రస్థాయి పనుల పురోగతిని సమీక్షించారు. 500 కి.మీ.లకు పైగా పొడవైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును అమలు చేస్తున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) అధికారులు, సెంట్రల్ రైల్వే అలాగే వెస్ట్రన్ రైల్వే ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని వైష్ణవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బికెసిలోని బుల్లెట్ రైలు ప్రారంభ స్టేషన్లో పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. బి3 బేస్మెంట్ స్థాయి, స్టేషన్ గోడల బలోపేతం పూర్తయిందని చెప్పారు. అదే సమయంలో సొరంగం పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. సొరంగం భాగం దాటి, భూసేకరణ తర్వాత మహారాష్ట్ర విభాగంలో కొనసాగుతున్న అన్ని పనులు అధిక వేగంతో కొనసాగుతున్నట్లు తెలిపారు.
బీకేసీలో ప్రపంచ స్థాయి స్టేషన్‌ను బహుళ అంతస్తుల్లో నిర్మించడానికి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. కార్యాచరణ ప్రాంతాలు B1 నుండి B3 స్థాయిల్లో ఉంటాయని, B3 రైలు పార్కింగ్ ప్రాంతంగా, B2 కార్యాచరణ విధుల నిర్వహణ, గ్రౌండ్ లెవల్‌తో కూడిన B1 ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నారు. BKC బుల్లెట్ రైలు స్టేషన్లో తవ్వకం పనుల్లో దాదాపు 76 శాతం పూర్తయినట్లు NHSRCL అధికారులు తెలిపారు.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. వాటా ఒప్పందం ప్రకారం, భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఒక్కొక్కటి రూ.5 వేల కోట్లు విరాళంగా ఇస్తాయి. మిగిలిన నిధులు జపాన్ నుండి 0.1 శాతం వడ్డీకి రుణం ద్వారా అందించబడుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గత వారం ఈ ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టు 2028 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు.