MK Stalin-Amit Shah | హిందీని ప్రధాన భాషగా అమలు చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ‘మేం హిందీకి ఎంత మాత్రం బానిసలం కాబోం’ అని శనివారం స్పష్టం చేశారు.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన జాతీయ భాషా పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నెమ్మదిగానైనా వ్యతిరేకత లేకుండా హిందీని ప్రధాన భాషగా తప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. ఇతర భాషలతో హిందీ పోటీ పడటం లేదని, జాతీయ భాషలను ప్రోత్సహించడం వల్ల జాతీయతకు సాధికారిత లభిస్తుందని వ్యాఖ్యానించారు.
అమిత్ షా వ్యాఖ్యలపై ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘హిందీని ఆమోదించాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన సాహసోపేత ప్రకటనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇతర భాషలు మాట్లాడే వారిపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే. ఏ రూపంలో హిందీని రుద్దే ప్రయత్నా్న్ని తమిళనాడు తిరస్కరిస్తుంది. మా భాష, వారసత్వమే మమ్ముల్ని నిర్వచిస్తుంది. హిందీకి బానిసలం కాబోం’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
‘హిందీని బలవంతంగా రుద్దాలన్న చర్యలను కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తాయి. పెరుగుతున్న నిరసనను గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గుర్తించాలని అభ్యర్థిస్తున్నా. హిందీ భాషను ఇతర భాషలు మాట్లాడే వారిపై రుద్దేందుకు ఎటువంటి అనాలోచిత ప్రయత్నం చేసినా 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమానికి బీజం వేసినట్లే’ అని మరో ట్వీట్ లో స్టాలిన్ తేల్చి చెప్పారు.