కోల్‌కతా: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈద్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పేరుతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటు వేసే హక్కును కాలరాస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లను కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రభావాన్ని చూపే ఉద్దేశంతో కేంద్రం ఆ ప్రక్రియ చేపట్టిందని ఆమె ఆరోపించారు. మోదీ కానీ, బీజేపీ కానీ, మీ ఓటు హక్కును చోరీ చేయనివ్వమని, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాటం కొనసాగిస్తానని బెనర్జీ తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు సీఎం ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. మైనార్టీ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి డిలీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రివిజన్ , వెరిఫికేషన్ సాకుతో ఓటర్ల హక్కులను కాజేస్తే దాన్ని తమ పార్టీ అడ్డుకుంటుందని బెనర్జీ తెలిపారు. బెంగాల్‌ను టార్గెట్ చేసి, రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న వారు నరకానికి వెళ్తారని ఆమె పేర్కొన్నారు. ఐకమత్యాన్ని బెంగాల్ విశ్వసిస్తుందని, హిందువులు.. ముస్లింలు.. సిక్కులు.. క్రైస్తవులు ఇక్కడ కలిసి జీవిస్తారని, ఈ సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఊరుకోబోమన్నారు.