భోపాల్, డిసెంబర్ 26 : బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్‌లో అధికార బీజేపీ నేత కుమారుడొకరు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బీజేపీ నేత కుమారుడు, శివపూరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్రి శర్మల కుమారుడు రజత్ శర్మ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ శివపూరి జిల్లాకు చెందిన ఒక మహిళ నిద్రమాత్రలు, ఎలుకల మందు తీసుకుని ఆత్యహత్యా యత్నం చేసింది. ఆమెను దవాఖానకు తరలించడంతో ప్రాణాలతో బయటపడింది.
కాగా, అత్యాచారం, ఇతర ఆరోపణలతో బాధితురాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫిర్యాదు చేయగా రజత్ శర్మపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా, రజత్, అతని తల్లిదండ్రులు గత ఏడు నెలల నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని, అంతేకాకుండా తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
భువనేశ్వర్, డిసెంబర్ 26: బీజేపీ పాలిత ఒడిశాలోని భద్రక్‌లో మరో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 17వ తేదీన భద్రక్‌లో 17 ఏండ్ల బాలిక ఇంట్లో వంట చేస్తుండగా, 26 ఏండ్ల వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వారి సోదరీమణులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. మూడు రోజుల పాటు తీవ్ర మానసిక వేదన అనుభవించిన ఆమె, జరిగిన విషయాన్ని రాసి ఈ నెల 20న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది.
విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నది. దామర పంచాయతీకి చెందిన 26 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రేప్ కేసు పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న సమయంలో ఆ ప్రాంతం.. మరో బాలికపై అత్యాచారం, హత్య కేసు కారణంగా ఉద్రిక్తతతో అట్టుడుకుతున్నది. 10 ఏండ్ల బాలికను చాంద్‌బలి ప్రాంతంలో ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులు అతని ఇంటిపై దాడి చేశారు.