Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. తల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశించిన వ్యక్తి.. ఆమె చిన్నారి కొడుకును అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఫిరోజాబాద్ నగరంలో జరిగింది. ఫిరోజాబాద్‌కు చెందిన జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉండే రాఠి అనే ఒక మహిళపై కన్నేశాడు. అయితే, ఆమెకు అప్పటికే ఆరవ్ అనే ఏడాదిన్నర వయసున్న ఒక కొడుకు ఉన్నాడు.
తను రాఠిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న విషయాన్ని ఆమెకు చెప్పాడు. కానీ, తనకు పెళ్లై, కొడుకు కూడా ఉన్నాడని, అందువల్ల మళ్లీ పెళ్లి చేసుకోలేనని విరాజ్‌కు చెప్పింది. దీంతో తన పెళ్లికి ఆమె కొడుకు ఆరవ్ అడ్డుగా ఉన్నాడని భావించిన విరాజ్.. శనివారం ఆమె ఇంటికి వెళ్లాడు. బాలుడికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి, ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. చిన్నారి బాలుడిని నేలకేసి దారుణంగా కొట్టాడు. కింద పడ్డ బాలుడిని మళ్లీ నేలకేసి కొట్టాడు. ఇది గమనించిన బాలుడి కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చి, బాలుడిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. కానీ, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు.
దీనిపై మహిళ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే విరాజ్ అక్కడ్నుంచి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడి కోసం వెతికారు. ఈ క్రమంలో విరాజ్ మణిపూర్ రోడ్ వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నలుగురు పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. తను అక్కడి చెట్లు, పొదల్లో దాక్కుని పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో విరాజ్ కాలికి గాయమైంది. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు.
అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గరినుంచి కొన్ని ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. విరాజ్‌కు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.