Crime news : ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిషా సింగ్ (Nisha Singh) అనే 33 ఏళ్ల మహిళ ఈ నెల 6న మెడిసిన్ కొనడానికి వెళ్తున్నానని ఇంట్లో తన కుమారుడికి చెప్పి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదు.
కొంతసేపటి తర్వాత.. నిషాసింగ్కు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని, సాయ్ఫాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఆమె తండ్రి బలరామ్ సింగ్‌కి పోలీసుల నుంచి సమాచారం అందింది. దాంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన బలరామ్ సింగ్ తీవ్రంగా కాలిన తన కుమార్తెను చూసి విలపించాడు. ఏం జరిగిందని ఆరా తీశాడు. దీపక్ అనే వ్యక్తి నిత్యం తనను వేధిస్తున్నాడని, మాట్లాడి పంపిస్తానని చెప్పడంతో వెళ్లానని చెప్పింది.
అక్కడికి వెళ్లేసరికి దీపక్‌తోపాటు అతడి ఐదుగురు స్నేహితులు కూడా ఉన్నారని, వారు తనతో వాగ్వాదానికి దిగి పెట్రోల్ పోసి నిప్పింటించారని తెలిపింది. కాలిన గాయాలతోనే తాను స్కూటీ నడుపుకుంటూ సమీప ఆస్పత్రికి వెళ్లానని చెప్పింది. అక్కడి నుంచి తనను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి, తర్వాత సాయ్ఫాయ్ ఆస్పత్రికి తరలించారని తెలిపింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలి తండ్రి బలరామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు తమ తల్లి సల్వార్ సూట్లో ఉన్నదని, ఆస్పత్రిలో షార్ట్, రౌండ్ నెక్ షర్ట్‌తో ఉన్నదని మృతురాలి పిల్లలు చెప్పడంతో.. ఆమె దుస్తులు ఎందుకు మారాయి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా మృతురాలు నిషా సింగ్ భర్త అమిత్ చౌహాన్, రుద్ర, శౌర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అమిత్ చౌహాన్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.