గువాహటి, నవంబర్ 8: అశాంతితో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ముగ్గురు పిల్లల తల్లి అయిన హ్మార్ జాతికి చెందిన ఒక మహిళను సాయుధులైన కొందరు దుండగులు అత్యాచారం జరిపి సజీవ దహనం చేశారు. వీరు మైతీ జాతీయులుగా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిరిబామ్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిపోయి ఉన్న 31 ఏండ్ల మహిళ మృతదేహాన్ని స్థానిక సంస్థలు స్వాధీనం చేసుకున్నాయని, ఈ ఘటనకు ప్రతీకారంగా కాల్పులు, గృహ దహనాలు చోటు చేసుకున్నాయని అధికారులు చెప్పారు. కాగా, దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బాధితురాలి మృతదేహానికి పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని సిల్చార్‌లో పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు జిల్లా ఎస్పీ లేఖ రాశారు.