 
                                                            లక్నో: బీమా డబ్బు కోసం ఒక మహిళ తన ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Kills Son With Lover) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల ప్రదీప్ శర్మ తండ్రి కొన్ని నెలల కిందట మరణించాడు. ఆ తర్వాత మయాంక్ అలియాస్ ఇషు కటియార్‌తో అతడి తల్లికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రదీప్ దీనిని వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో తల్లికి దూరంగా ఉంటూ విడిగా నివసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం సంపాదించాడు.
కాగా, తమ సంబంధాన్ని వ్యతిరేకించిన కుమారుడు ప్రదీప్ అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు మయాంక్‌తో కలిసి అతడి తల్లి ప్లాన్ వేసింది. మయాంక్ తన సోదరుడు రిషితో కలిసి ప్రదీప్ పేరు మీద పలు బీమా పాలసీలు కొనుగోలు చేశాడు.
మరోవైపు దీపావళి సందర్భంగా ప్రదీప్ సొంతూరుకు తిరిగి వచ్చాడు. అక్టోబర్ 26న మయాంక్, రిషి కలిసి డిన్నర్ పేరుతో అతడ్ని కారులో తీసుకెళ్లారు. సుత్తితో తలపై పలుసార్లు కొట్టి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. బల్హరామౌ గ్రామం సమీపంలోని కాన్పూర్-ఎటావా హైవేపై మృతదేహాన్ని పడేశారు.
కాగా, ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడ్ని ప్రదీప్‌గా గుర్తించారు. ప్రియుడు మయాంక్, రిషితో కలిసి ప్రదీప్‌ను అతడి తల్లి హత్య చేయించినట్లు బాబాయ్, తాత ఆరోపించారు. అయితే తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అతడి తల్లి పోలీసులకు చెప్పింది.
మరోవైపు ప్రదీప్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేశారు. మయాంక్, రిషి కలిసి అతడి పేరుతో బీమా పాలసీలు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. బీమా డబ్బు కోసం ప్రియుడితో కలిసి కుమారుడి హత్యకు అతడి తల్లి ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో తేలింది.
కాగా, మయాంక్, రిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాల్పులకు పాల్పడిన రిషిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రదీప్ హత్యకు వినియోగించిన సుత్తి, కారుతో పాటు రిషి కాల్పులు జరిపిన గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Killed By Daughter’s Friends | ఇంట్లోకి రావద్దన్నందుకు.. మహిళను హత్య చేసిన కూతురి స్నేహితులు
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి.. ఆరు నెలల చిన్నారి మృతి
Watch: ఛత్ ప్రసాదం కోసం.. ప్యాసింజర్ రైలు ఆపిన లోకో పైలట్, వీడియో వైరల్
 
                            