లక్నో: మూడేళ్ల కుమార్తెను ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసింది. (Woman, Lover Kills Daughter) చిన్నారి మృతదేహాన్ని కాలువలో పడేశారు. వివాదం ఉన్న పొరుగింటి మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులైన ఆ మహిళ, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నరోరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న సీమా అలియాస్ లాలి భర్త కొన్నేళ్ళ కిందట మరణించాడు. దీంతో ప్రియుడు యతేంద్రతో సహజీవనం చేస్తున్నది. మూడేళ్ల కుమార్తె దివ్యాంశితో పాటు అతడితో కలిసి నివసిస్తున్నది.
కాగా, సీమా పనికి వెళ్లినప్పుడు ఆమె కుమార్తె ఇబ్బంది పెడుతున్నదని ప్రియుడు యతేంద్ర ఆరోపించాడు. ఆ చిన్నారి విషయంపై వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూతురి అడ్డు తొలగించుకునేందుకు సీమా ప్లాన్ వేసింది. అక్టోబర్ 1న ప్రియుడితో కలిసి దివ్యాంశిని హత్య చేసింది. బాలిక మృతదేహాన్ని నరోరా గంగా కాలువలో పడేశారు.
మరోవైపు అదే రోజున తన కుమార్తె అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో సీమా ఫిర్యాదు చేసింది. వివాదం ఉన్న స్థానిక మహిళ లాల్త్రేష్, ఆమె సంబంధీకులపై నెపం నెట్టేందుకు ప్రయత్నించింది. తన కుమార్తెను చంపేందుకు వారు కిడ్నాప్ చేసినట్లు ఆరోపించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే రోజున కాలువలో చిన్నారి దివ్యాంశి మృతదేహాన్ని గుర్తించారు. సీమా తన ప్రియుడు యతేంద్రతో కలిసి కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు.
సీమాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆమెతో పాటు ప్రియుడు యతేంద్రను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man jumps Into Yamuna With Children | ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త