బెంగళూరు: ఒక మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. దీని కోసం పెంపుడు కుక్కను బలి ఇచ్చింది. (Woman Kills Pet Dog In ‘Tantric’ Ritual) ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు తాళం వేసి వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. డోర్ తెరిచి చూసిన సిబ్బంది కుళ్లిన కుక్క మృతదేహంతోపాటు క్షుద్ర పూజల ఆనవాళ్లను గుర్తించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మహాదేవ్పురాలోని ఒక అపార్ట్మెంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన త్రిపర్ణ పాయక్ నివసిస్తున్నది. ఆమె మూడు పెంపుడు కుక్కలను పెంచుతున్నది.
కాగా, ఇటీవల ఆ మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. పెంచుతున్న లాబ్రడార్ కుక్కను బలి ఇచ్చింది. దాని గొంతు నొక్కి చంపిన తర్వాత కత్తితో మెడ కోసింది. మరణించిన కుక్క శరీరాన్ని ఒక గుడ్డలో చుట్టింది. ఇంట్లోని అన్ని కిటికీలు, డోర్లు మూసివేసింది. అపార్ట్మెంట్ మెయిర్ డోర్‌కు లాక్ వేసి వెళ్లిపోయింది.
మరోవైపు ఆ అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు, స్థానికులు గమనించారు. బీబీఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. గుడ్డలో చుట్టి మెడ కోసి ఉన్న కుళ్లిన కుక్క మృతదేహం వారికి కనిపించింది. అలాగే దేవుళ్ల ఫొటోలు, క్షుద్రపూజల ఆనవాళ్లు వంటివి అక్కడ గమనించారు. ఆ ఇంట్లోని గోడకు గొలుసులతో కట్టేసిన బతికి ఉన్న మరో రెండు పెంపుడు కుక్కలను కాపాడారు. వాటిని పశువైద్య శాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, లాబ్రడార్ కుక్క నాలుగు రోజుల కిందట చనిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో బెంగాల్‌కు చెందిన త్రిపర్ణ పాయక్పై జంతు హింస, సంబంధిత సెక్షన్ల కింద మహదేవ్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ మహిళ క్షుద్ర పూజలకు పాల్పడిందా? లేక ఆమె మానసిక పరిస్థితి బాగోలేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు సంరక్షణ సంఘాలకు చెందినవారు, జంతు ప్రేమికులు డిమండ్ చేశారు.
Also Read:
Man Kills Father Over Front Seat | ముందు సీటులో కూర్చోవడంపై వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు
Cop Caught With Rs 9 Lakh Bribe | కారులో రూ.9 లక్షలకుపైగా డబ్బుతో పోలీస్ అధికారి.. పట్టుకున్న ఏసీబీ
Acid On Pregnant Woman’s Abdomen | కాన్పు సమయంలో.. గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు