బెంగళూరు: ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. పరిహారం కోసం పులి దాడిలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పేడ కుప్ప నుంచి వెలికితీశారు. (Woman Kills Husband for Compensation) కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హున్సూరు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వెంకటస్వామి, సల్లపురి భార్యాభర్తలు. అరెకా గింజ తోటల్లో కూలీలుగా వారు పనిచేస్తున్నారు.
కాగా, సెప్టెంబర్ 8న హెజ్జూర్ గ్రామంలో ఒక పులి కనిపించింది. అటవీ జంతువుల దాడి బాధితులకు ప్రభుత్వం రూ.15 లక్షల పరిహారం ఇస్తుందని తోటి కూలీలు మాట్లాడుకోవడాన్ని సల్లపురి విన్నది. దీంతో భారీ పరిహారం కోసం భర్తను హత్య చేయాలని ఆమె ప్లాన్ చేసింది. ఆహారంలో విషం కలిపి భర్త వెంకటస్వామిని హత్య చేసింది. ఇంటి వెనుక ఉన్న పేడ కుప్పలో మృతదేహాన్ని దాచింది.
మరోవైపు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త అదృశ్యమయ్యాడని ఆ మహిళ వాపోయింది. గ్రామంలో తిరుగుతున్న పులి అతడ్ని ఈడ్చుకెళ్లి చంపి ఉంటుందని పోలీసుల వద్ద గగ్గోలు పెట్టింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కలిసి ఆమెతో పాటు జోరు వానలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే వెంకటస్వామి అదృశ్యమైనట్లు భార్య చెప్పిన ప్రాంతంలో అతడి మృతదేహం లభించలేదు. చివరకు అనుమానంతో వెంకటస్వామి ఇంటి పరిసరాల్లో వెతికారు. పేడ కుప్పలో దాచిన అతడి మృతదేహాన్ని బయటకు తీశారు.
కాగా, భార్య సల్లపురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో భర్తకు విషమిచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. పులి దాడిలో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం భారీగా పరిహారం ఇస్తుందని తెలుసుకుని భర్తను ఆమె చేసిందని చెప్పారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Imprisonment To Police Officer | కోర్టు విచారణలకు గైర్హాజరు.. పోలీస్ అధికారికి గంట జైలు శిక్ష
School Bus Topples | బెంగళూరులో అద్వాన్నంగా రోడ్లు.. గుంతలోకి ఒరిగిపోయిన బస్సు