అహ్మదాబాద్: ఒక మహిళకు తన బావతో ప్రేమ సంబంధం ఉంది. అయితే తల్లిదండ్రుల బలవంతంతో మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లైన నాలుగు రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. (Women kills Newly wed Husband) దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. అహ్మదాబాద్‌కు చెందిన భావిక్కు, గాంధీనగర్‌కు చెందిన పాయల్‌తో ఇటీవల వివాహం జరిగింది. భార్యను తన ఇంటికి తీసుకువచ్చేందుకు శనివారం బైక్‌పై అత్తవారింటికి బయలుదేరాడు.
కాగా, భావిక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి చేరకపోవడంతో అతడి తండ్రికి పాయల్ తండ్రి ఫోన్ చేశాడు. తమ ఇంటికే అతడు బయలుదేరినట్లు తెలిసి ఆ కుటంబమంతా వెతికారు. ఒకచోట రోడ్డుపై పడి ఉన్న భావిక్ బైక్‌ను గుర్తించారు. అయితే వాహనంలో వచ్చిన వ్యక్తులు అతడి బైక్‌ను ఢీకొట్టి కిడ్నాప్ చేసినట్లు స్థానిక వ్యక్తి తెలిపాడు. దీంతో పాయల్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
మరోవైపు పైళ్లైన నాలుగు రోజులకే భావిక్ కిడ్నాప్ కావడంతో పాయల్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మొబైల్ కాల్ డేటా పరిశీలించిన తర్వాత గట్టిగా ప్రశ్నించారు. దీంతో బావ కల్పేష్‌తో ప్రేమ వ్యవహరం ఉన్నట్లు పాయల్ తెలిపింది. తన తల్లిదండ్రులు భావిక్‌తో పెళ్లి చేయడంతో ప్రియుడితో చెప్పి కిడ్నాప్ చేయించి చంపించినట్లు చెప్పింది.
కాగా, పాయల్ సమాచారంతో కల్పేష్ ఆచూకీని ట్రాక్ చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరితో కలిసి భావిక్‌ను కిడ్నాప్ చేసి, వాహనంలో గొంతునొక్కి హత్య చేసినట్లు అతడు తెలిపాడు. ఆ తర్వాత సమీపంలోని కాలువలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. దీంతో భావిక్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. కల్పేష్, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పాయల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.