భోపాల్: సకాలంలో అంబులెన్స్ రాక నిండు గర్భిణికి రోడ్డు పక్కనే ప్రసవం చేయాల్సిన దుస్థితి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో నెలకొంది. ఒక పక్క వణికించే చలి.. మరో పక్క చిమ్మ చీకటి. మినుకుమినుకుమంటున్న టార్చిలైట్ వెలుగులో, చిరుగుల టార్పాలిన్‌ను మరుగుగా ఉంచిన దుస్థితిలో ఆ మహిళ రోడ్డు పక్కన బిడ్డకు జన్మనిచ్చింది.
ఘటన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల దుస్థితిని వెల్లడించింది. మూడు గంటలు వేచి చూసినా అంబులెన్స్‌ను కూడా పంపలేని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఆధునిక వైద్య సదుపాయాలున్న విదిశ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే చలిలో, టార్పాలిన్‌ను అడ్డుగా కట్టి ఆ మహిళకు ప్రసవం చేశారు. ప్రసవం తర్వాత కూడా ఆ బాలింత, నవజాత శిశువు చలిలోనే రెండు మూడు గంటలు గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.