Karwa Chauth | దేశంలోని మహిళలు నేడు కర్వాచౌత్ (Karwa Chauth) వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భర్త క్షేమం కాంక్షిస్తూ మహిళలు నిష్టగా నోచే నోము ఇది. ఇంతటి విశిష్టత కలిగిన రోజున ఓ మహిళ తన భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు కిడ్నీ (kidney) దానం చేసి పునర్జన్మనిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని రాజ్‌గఢ్ (Rajgarh)లో చోటు చేసుకుంది.
రాజ్‌గఢ్ పట్టణానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి గతంలో కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నాడు. అయితే అతను నిత్యం తలనొప్పి, అలసటతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షల్లో అతని రెండు మూత్రపిండాలూ దెబ్బతిన్నట్లు తేలింది. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. దీంతో పురుషోత్తం కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే, ఎవరూ కిడ్నీ దానం చేయడానికి ముందుకు రాలేదు.
అతడి భార్య ప్రియా ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తన అవయవాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చింది. ‘నా మూత్రపిండాలు ఆయన ప్రాణాలు కాపాడగలిగితే.. ఇది నా నిజమైన కర్వాచౌత్ అవుతుంది’ అంటూ ఆమె పేర్కొంది. ఈ మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రియ బ్లడ్‌గ్రూప్, కణజాలాలు తన భర్త బ్లడ్‌గ్రూప్‌తో సరిపోలాయి. దీంతో వైద్యులు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. కర్వాచౌత్ రోజు ప్రియ తన భర్తకు అవయవదానం చేసి పునర్జన్మని ప్రసాదించింది.
Also Read..
Karwa Chauth | కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం.. కర్వాచౌత్ విశేషాలు..
Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్